ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర(సంగారెడ్డి): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చందాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. కరెంట్ సక్రమంగా అందకపోవడంతో బోరు మోటార్లు తరచూ కాలిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా కనీసం 12 గంటలైనా కరెంట్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ సక్రమంగా అందకనే వరి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సాగుకు మెరుగైన విద్యుత్ అందించాలని, లేకుంటే రైతుల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు నర్సింలు, ఆంజనేయులు, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు కృష్ణ, శ్రీకాంత్, వీరేందర్, ఇబ్రహీం, ఆగమయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


