ఆర్టిజన్‌పై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్‌పై సస్పెన్షన్‌ వేటు

Oct 13 2026 11:43 AM | Updated on Oct 13 2026 11:43 AM

● అనధికారికంగా విద్యుత్‌లైన్‌ వేసి.. అక్రమ కనెక్షన్‌ ఇచ్చిన వ్యవహరం

● వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ కథనం..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీ కోసం అనధికారికంగా విద్యుత్‌ లైన్‌ నిర్మించి.. అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్‌ కట్టబెట్టిన వ్యవహరంలో పటాన్‌చెరు రూరల్‌ సెక్షన్‌ ఆర్టిజన్‌ ఎం.సురేశ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ‘సాక్షి’లో ‘భరితెగింపు!’ అనే శీర్షికన శనివారం ప్రచురితమైన సమగ్ర కథనానికి ఆశాఖ ఉన్నతాధికారులు స్పందించా రు. ఈ మేరకు సెలవు రోజుల్లోనైనా శని, ఆదివారాల్లో ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ మేరకు సోమవారం సురేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్‌ కనెక్షన్‌ జారీ చేయా లని కోరుతూ వినియోగదారుడి నుంచి దరఖాస్తు తీసుకుండానే.. ఆ విద్యుత్‌ కనెక్షన్‌ నిర్మాణానికి అయ్యే లైన్‌ నిర్మాణానికి అంచనా(ఎస్టిమేషన్‌) రూ పొందించకుండా.. ఆ పనికి సాంక్షన్‌ రాకుండానే ఏకంగా అనధికారికంగా విద్యుత్‌ లైన్‌ను నిర్మించా రు. బరితెగించి ఆ స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రికి అక్రమ కనెక్షన్‌ ఇచ్చారు. ఈ వ్యవహరంలో రూ.లక్షల్లో ముడుపులు దండుకున్నారు. పైగా నెలనెలా విద్యుత్‌ బిల్లుల పేరుతో కూడా సంబందిత ఇండస్ట్రి నుంచి వసూళ్లు చేసి జేబులు నింపుకున్నారు. ఈ అక్రమాల బాగోతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. శనివారం సమగ్ర కథనం ప్రచురించడంతో అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. తక్షణం స్పందించి విచారణకు ఆదేశించి ఈ చర్యలకు ఉపక్రమించారు.

ఉన్నతాధికారి హస్తంపై ఆరా..

ఈ స్థాయిలో బరితెగింపు ఒక్క ఆర్టిజన్‌తోనే సాధ్యం కాదు. సంబంధిత అధికారి హస్తం లేనిదే ఈ అక్రమ కనెక్షన్‌ జారీ చేయడం సాధ్యం కాదు. దీంతో ఈ వ్యవహరంలో ప్రమేయం ఉన్న అధి కారిపైనా అశాఖ అంతర్గతంగా విచారణ చేపట్టింది. కేవలం ఆర్టిజన్‌పై సస్పెన్షన్‌ వేటుతోనే సరిపెడతారా.? లేదంటే ప్రమేయం ఉన్న సదరు అధికారిపై కూడా వేటు పడుతుందా? అనే శాఖ పరమైన విచారణ పూర్తయితే గానీ స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.

కేసు నమోదు చేసిన విజిలెన్స్‌

అడ్డగోలుగా పరిశ్రమకు అక్రమ కనెక్షన్‌ ఇచ్చిన వ్యవహరంపై ఆశాఖ విజిలెన్స్‌ విభాగం కేసు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తు చేసిన ఈ విభాగం పరిశ్రమ యాజమాన్యంపై కేసు పెట్టింది. మరోవైపు ఈ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడంలో కీలకమైన ఆర్టిజన్‌ సురేష్‌ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ స్టేట్‌మెంట్‌లో కీలక అంశాలు విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. అధికారి మౌఖికంగా ఆదేశిస్తేనే తాను అక్రమ కనెక్షన్‌ ఇచ్చానని ఆర్టిజన్‌ విజిలెన్స్‌ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అడ్డగోలు వ్యవహరంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడం ఆశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement