నిర్మాణాలు ఆగలే | - | Sakshi
Sakshi News home page

నిర్మాణాలు ఆగలే

Oct 13 2026 11:43 AM | Updated on Oct 13 2026 11:43 AM

నోటీసులు మామూలే..

● అటవీ భూముల్లో అక్రమంగా రేకుల షెడ్లు

● పట్టించుకోని అటవీశాఖ అధికారులు

● దుకాణాలకు దర్జాగా విద్యుత్‌ కనెక్షన్లు

హత్నూర(సంగారెడ్డి): అడవిలోని చెట్లను నరికి.. కొందరు అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు నిర్మాణాలు చేపట్టారు. అందులో భారీ రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయినా అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మామూళ్ల మత్తులో మునుగుతూ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

హత్నూర మండలం షేర్‌ఖాన్‌పల్లి శివారులోని పలుగుమీది నల్ల పోచమ్మ దేవాలయం పరిసరాల్లోని అడవిలో భారీ ఎత్తున చెట్లను నరికి రేకుల షెడ్లు నిర్మించారు. అందులో అధికారుల అండతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అమ్మవారి దర్శ నం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. భారీ రేకుల షెడ్ల ఎదుట వాహనాలు నిలుపుతుండడంతో ఆర్టీసీ సర్వీసు సైతం రద్దయింది. అక్రమంగా నిర్మించిన భారీ రేకుల షెడ్లను తొలగించాలని అటవీశాఖ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలే అక్రమ నిర్మాణాలు.. ఆపై అందులో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అక్రమ రేకుల షెడ్ల నిర్మాణాలకు విద్యుత్‌ కనెక్షన్లు సైతం తీసుకొని పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. దీంతో తరచూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గొడవలు పడుతూ పోలీస్‌స్టేషన్‌కు సైతం వెళ్లి కేసులు పెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. దుకాణ సముదాయాల్లో మద్యం మత్తులో పేకాట సైతం జోరుగా సాగుతుందని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అటవీ, పోలీస్‌, రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు సమన్వయంతో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరారు.

నోటీసులు ఇచ్చాం

షేర్‌ఖాన్‌పల్లి శివారులోని పోచమ్మ ఆలయం వద్ద అడవిలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లకు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చాం. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకుంటాం.

– దేవీలాల్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement