కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్: ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు సూచించారు. సోమవారం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగిలో నీటి లభ్యతను బట్టి రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వరి సాగుకు బదులుగా పెసలు, మినుములు, శనగ, కుసుమ వంటి తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బిందు సేద్యంతో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోరు బావుల రీఛార్జ్ ద్వారా భూగర్భజలాలను పెంపొందించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మున్సిపల్, ఇతర అధికారులతో తాగునీటిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశమున్న ప్రాంతాల వివరాలను సేకరించాలన్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు.


