అతివేగం, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలు చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు రోడ్డు నిబంధనలు పాటించాలి: పోలీసులు
220 మంది మృతి
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు..
సిద్దిపేటకమాన్: జిల్లాలో రాజీవ్ రహదారిపై, ఇతర ప్రధాన రోడ్లపై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది మృత్యువాత పడగా..మరికొంత మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. దీంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఎక్కువగా అతివేగం, అజాగ్రత్త, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
21 నెలల్లో 1,320 రోడ్డు ప్రమాదాలు
జిల్లాలో రాజీవ్ రహదారి వెంట రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలపడం వల్ల రాత్రి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో గతేడాది 730 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 285 మంది మృతి చెందగా, 644 మందికి గాయాలయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ చివరి వరకు 590 రోడ్డు ప్రమాదాల్లో 220 మంది మృత్యువాత పడగా, 600మందికి గాయాలయ్యాయి. గత 21నెలల్లో మొత్తం 1,320 రోడ్డు ప్రమాదాల్లో 505 మంది మృతి చెందగా, 1,244 మంది క్షతగాత్రులయ్యారు. రహదారులపై ఎటువంటి హెచ్చరిక సంకేతాలు లేకుండా వాహనాలను పార్క్ చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, అటువంటి వాహనాలకు జరిమానాలు విధిస్తున్నామని పోలీసులు తెలిపారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
త్వరగా ఇంటికి వెళ్లడం కంటే సురక్షితంగా చేరుకోవడం ముఖ్యం. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ద్విచక్ర వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి. త్రిబుల్ రైడింగ్, మైనర్ రైడింగ్ చేయకూడదు.
– సీపీ రష్మీ పెరుమాళ్


