●ఓటేసిన 1,797 మంది ఉద్యోగులు ●17న అధికారికంగా ఫలితాల ప్రకటన
సంగారెడ్డి జోన్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్ రీజియన్ పరిధిలో ఏర్పాటుచేసిన 8 పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మెదక్ రీజియన్ పరిధిలో 8 డిపోలు, ఒకటి ఉమ్మడి మెదక్ రీజియన్ కార్యాలయం ఉంది. మొత్తం 1,805 మంది ఓటర్లు ఉండగా, 1,797 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,779 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయగా 18 పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరిగింది. మిగితా 26 మంది ఉద్యోగులు విధులకు హాజరు కావడంతో ఈనెల 14, 15 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి కార్మికుడు రాష్ట్రస్థాయితో పాటు రీజనల్ స్థాయికి రెండేసి ఓట్లు వేశారు.
ఉత్సాహంగా ఓటింగ్
పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆయా డిపోల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుర్తింపు ఎన్నికల్లో 12 యూనియన్లు బరిలో ఉండగా, మూడు కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించనుంది. శుక్రవారం జరిగిన పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరిపారు. సంగారెడ్డి, జహీరాబాద్‌తో పాటు మిగితా డిపోలో కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న తెలంగాణ వర్కింగ్ యూనియన్‌కు అత్యధిక ఓట్లు పోలై, ముందంజలో ఉంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు దిశగా ఉండటంతో ఆ యూనియన్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అధికారిక ఫలి తం కొరకు ఆశాఖ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అరకొర బస్సులతో అవస్థలు
నారాయణఖేడ్: నియోజకవర్గానికి చెందిన అనేకమంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విధ్యనభ్యసిస్తుంటారు. విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లడానికి ఖేడ్‌కు వచ్చారు. శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల నేపథ్యంలో బస్సులు అరకొరగా నడిచాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలపై వెళ్లారు.


