కంగ్టి(నారాయణఖేడ్): అప్రకటిత విద్యుత్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. శుక్రవారం మండలంలోని తడ్కల్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే గంటల తరబడి నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రైతులకు సంఘీభావం ప్రకటించారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని మండిపడ్డారు. అన్నదాతలకు కనీసం ఐదారు గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వక మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్ సరఫరాలోనే కాకుండా ఎరువులకు నానా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రైతుబంధు అరకొరగా పంపిణీ చేసి రైతులను నట్టేట ముంచిందన్నారు. రైతులు కన్నీరు పెడుతుంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కృష్ణ ముదిరాజ్, కురాకుల కృష్ణ, మాణిక్‌రెడ్డి, సిద్దరమేశ్, నాయకులు అంజనేయులు సేట్, రమేశ్, వెంకట్‌రెడ్డి, బస్వరాజ్, గోవింద్‌రావు, సురేందర్‌రెడ్డి, గంగారాం, అంజన్న, దత్తురావు, సాయాగౌడ్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.


