సంగారెడ్డి టౌన్: గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి షరతులు పెట్టకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ద్విచక్ర వాహనాలు, కాట మయ్య రక్షణ కవచాలు ఇవ్వాలన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. సదస్సుకు జిల్లాలోని గీత కార్మికులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటేశం గౌడ్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శనివారం స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ సైదానాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. ఆ ధార్, ప్రిలిమినరీ అప్లికేషన్ ఫారం తప్పక తీసుకొని రావాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లు తీసుకొని రావద్దని సూచించారు.
నర్సాపూర్: రైతుల కరెంట్ కష్టాలను తీర్చాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆమె పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల పాటు మెరుగైన కరెంట్ సరఫరా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రోజుకు ఐదారు గంటలే ఇస్తున్నారని మండిపడ్డారు. అది కూడా సరిగా ఇవ్వకపోవడంతో బోరు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని వాపోయారు. సింగరేణి గనుల్లో లభిస్తున్న నాణ్యమైన బొగ్గును ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుందన్నారు. నాణ్యత లేని బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేయడంతో లో ఓల్టేజీ సమస్య వస్తుందని ఆరోపించారు. రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన కరెంట్ ఇవ్వని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు శేఖర్, మధుకర్‌రెడ్డి, నాగరాజుగౌడ్, నర్సాగౌడ్, రాములునాయక్, విఠల్, యాదాగౌడ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


