గొల్లుమన్న మనూరు | - | Sakshi
Sakshi News home page

గొల్లుమన్న మనూరు

Oct 10 2026 8:02 AM | Updated on Oct 10 2026 8:02 AM

పండుగ తెచ్చిన విషాదం

నారాయణఖేడ్‌: సంబురంగా పండగ ఏర్పాట్లలో ఉన్న ఆ కుటుంబాన్ని కుంట రూపంలో కబళించింది. ఒక్కసారిగా ముగ్గురిని తనలో కలిపేసుకుంది. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని తెచ్చి పెట్టింది. ఈ విషాదకర సంఘటన మనూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది. చదువుకుంటున్న ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది.

గటీల కోసం..

కర్ణాటక, మహారాష్ట్ర సంప్రదాయం అయిన దసరా పండగ ముందు అమావాస్య తర్వాత నుంచి పది రోజుల పాటు భవానీమాతను ప్రతిష్ఠించి గటీల పేర నిష్టతో పూజలు నిర్వహిస్తారు. పండగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేసి బట్టలు ఉతికేందుకు మనూరు శివారులోని సంగమేశ్వర కుంట వద్దకు నర్సింహారెడ్డి, అతడి భార్య కృష్ణవేణి, చిన్న కొడుకు హర్షవర్ధన్‌రెడ్డి, సోదరుడు సంగారెడ్డి వెళ్లారు. కుంటలో దుస్తులు ఉతుకుతున్న క్రమంలో సంగారెడ్డి కాలు జారి పడిపోగా చిన్నాన్నను కాపాడే క్రమంలో హర్షవర్ధన్‌రెడ్డి చేయి అందించాడు. అతడూ నీటిలో పడిపోయాడు. గమనించిన తల్లి కృష్ణవేణి, తండ్రి నర్సింహారెడ్డి వెళ్లి వీరిద్దనీ పైకి తెచ్చే క్రమంలో వీరూ నీట మునిగారు.

మృత్యుంజయుడు ఆ బాలుడు

చిన్నకొడుకు హర్షవర్ధన్‌రెడ్డికి కుంట ఒడ్డున చిన్నపాటి చెట్టు కొమ్మలు కనిపించడంతో అందిపుచ్చుకున్నాడు. ఆ కొమ్మలను పట్టుకొని ఒడ్డుకు చేరి ప్రాణపాయం నుంచి బయట పడ్డాడు. విషయం సమీపంలోని చేలో ట్రాక్టర్‌ నడుపుతున్న వారిని చెప్పగా వారు తమకు ఈతరాదని చెప్పారు. వెంటనే గ్రామానికి వెళ్లి విషయం చెప్పాడు. అప్పటికే కుంట వద్దకు చేరుకున్న గ్రామస్తులు నీటిలో మునిగిన వారికి బయటకు తీశారు. అప్పటికే నర్సింహారెడ్డి, సంగారెడ్డి మృతిచెందగా, కృష్ణవేణి కొన ఊపిరితో ఉంది. హుటాహుటిన ఖేడ్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రులు, చిన్నాన్న మరణంతో ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు, వీరికి తోడు వృద్ధాప్యంలో ఉన్న 70 ఏళ్ల నానమ్మ ఈరమ్మ మాత్రమే మిగిలారు.

దుస్తులు ఉతికేందుకు కుంటకు వెళ్లి ముగ్గురు మృత్యువాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement