వర్గల్ (గజ్వేల్): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నూతన సాంకేతికత అందిపుచ్చుకొని, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పిలుపునిచ్చారు. వర్గల్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఫైనాన్షియల్ డిజిటలైజేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై సోమవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంజేపీబీసీ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మామిడి హరికృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంత రం సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రపంచీకరణ, డిజిటలైజేషన్, సాంకేతిక విప్లవం భారతదేశంలో ఆర్థిక రంగాన్ని సమూలంగా మార్చివేశాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ సుచరిత, ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ ప్రశాంత ఆత్మ, డాక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.


