కల్హేర్(నారాయణఖేడ్): కారు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజాంపేట్ మండల కేంద్రం 161 నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై సోమవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. నిజాంపేట్‌కు చెందిన సూర్ణ బీరప్ప–నాగవ్వ దంపతుల కుమారుడు భానుప్రసాద్(25) హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో చెరుకు రసం బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బంధువుల పెద్దల పండుగ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు. భానుప్రసాద్ ద్విచక్ర వాహనంపై పెద్దశంకరంపేట్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో భానుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్న వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా మృతుడు భానుప్రసాద్‌కు రేగోడు మండలం మర్పల్లికి చెందిన జ్యోతితో ఆరు నెలల క్రితం వివాహమైంది. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


