రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

ఉమ్మడి జిల్లాలో నెత్తురోడిన రహదారులు

కాస్లాపూర్‌ వద్ద అన్నాచెల్లెలు..

ఉమ్మడి జిల్లాలో నెత్తురోడిన రహదారులు

ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. వివరాలు ఇలా..

చెత్త ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఇద్దరు..

హుస్నాబాద్‌: చెత్త ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని గణేశ్‌ నగర్‌కు చెందిన నద్దునూరి శ్రీకాంత్‌ (32), బైరి నర్సింహ(35), నాగులమ్మ కాలనీకి చెందిన నద్దునూరి శ్రీనివాస్‌ జిల్లెల్లగడ్డ నుంచి మద్యం మత్తులో బైక్‌పై హుస్నాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని హన్మకొండ రోడులో కళ్యాణమస్తు షాపింగ్‌ మాల్‌ సమీపంలో చెత్త సేకరణకు ఆగి ఉన్న మున్సిపల్‌ ట్రాక్టర్‌ను వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎగిరిపడి ఒకరిపై ఒకరు పడిపోయారు. ఇందులో శ్రీకాంత్‌, నర్సింహకు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్‌కు గాయాలు కాగా అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం, సీఐ శ్రీధర్‌, ఎస్సై లక్ష్మారెడ్డి సందర్శించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వాచ్‌మెన్‌..

కొండపాక(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో వాచ్‌మెన్‌ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోల సత్తయ్య (అలియాస్‌ సత్యనారాయణ)(58) సత్తయ్య వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తుండగా, భార్య కొమురవెళ్లి కమాన్‌ సమీపంలో ఉన్న హోటల్‌లో స్వీపర్‌గా పని చేస్తుంది. కాగా గ్రామ శివారులో రాజీవ్‌ రహదారి ప్రక్కన కొత్తగా హోటల్‌ పెట్టేందుకు రేకుల షెడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అతడు వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నైట్‌ డ్యూటీ విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలై సత్తయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు డ్రైవరు చంద్రంపై కేసు నమోదు చేశారు.

కుక్కలను తప్పించబోయి..

సిద్దిపేటకమాన్‌: కుక్కలను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. సిద్దిపేట రూరల్‌ ఎస్‌ఐ నవత వివరాల ప్రకారం.. రూరల్‌ మండలం ఇర్కోడు గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబంతో కలిసి పట్టణంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఇర్కోడుకు వెళ్లి తిరిగి ఆదివారం రాత్రి సిద్దిపేటకు వస్తున్నాడు. ఈ క్రమంలో రూరల్‌ పోలీసు స్టేషన్‌ చౌరస్తా సమీపంలో అకస్మాత్తుగా కుక్కలు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. రాత్రి అయినా శ్రీనివాస్‌ ఇంటికి రాకపోవడంతో అతడి కుమారుడు అన్షిక్‌, తన స్నేహితుడితో కలిసి వెతుక్కుంటూ వెళ్లారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న శ్రీనివాస్‌ను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్‌ వద్ద 44వ జాతీయ రహదారి సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం మాచిన్‌పల్లి గ్రామానికి చెందిన మామిండ్ల చంద్రయ్య(70), వరుసకు చెల్లె అయినా మామిండ్ల పోచమ్మ(50)తో కలిసి యాక్టివాపై చిన్నశంకరంపేటలో ఓ ఫంక్షన్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారిపై యూటర్న్‌ తీసుకునే క్రమంలో వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ రాజధాని డీలక్స్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆసుత్రికి తరలించి, ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement