● ఆరు నెలల్లోనే రైతులకు అధిక లాభాలు
● రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి గెలలు
నంగునూరు(సిద్దిపేట): రైతులకు వరప్రదాయినిగా మారింది సిద్దిపేట జిల్లా నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ. ఆరు నెలల కింద సీఎం రేవంత్‌రెడ్డి కర్మాగారాన్ని ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల నుంచి ఆయిల్‌పామ్ గెలలు ఇక్కడికి తరలిస్తున్నారు. రైతులను లాభాల బాట పట్టిస్తూ అంచనాలకు మించి ఆయిల్ ఉత్పత్తి జరగడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూనె తీయగా వచ్చిన బయో వ్యర్థాలతో 1.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 10 కోట్ల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించిన చెరువు నీటిని రీసైక్లింగ్ చేస్తూ ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకుంటున్నారు.
ఆయిల్‌ఫెడ్ చేతిలో ధర నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా ఏ ఫ్యాక్టరీ నుంచి నూనె రికవరీ శాతం, ముడి పామాయిల్ అమ్మకం ఎక్కువగా ఉంటుందో దాని ఆధారంగా పామాయిల్ గెలల ధరను టీజీ ఆయిల్‌ఫెడ్ నిర్ణయిస్తుంది. నర్మేటను ప్రామాణికంగా తీసుకోవడంతో ఫిబ్రవరిలో టన్ను గెల ధర రూ.21,546 ఉండగా సెప్టెంబర్‌లో రూ.23,641 పలికింది. పంటను అమ్ముకున్న మూడు రోజుల్లోనే డబ్బులు జమ చేస్తూ అధికారులు ఆయిల్‌పామ్ పంటపై రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 250 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
రోజుకు 610 మెట్రిక్ టన్నులు..
అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల గెలలను క్రషింగ్ చేసి రోజుకు 610 మెట్రిక్ టన్నుల ఆయిల్ ప్రాసెసింగ్ జరుగుతోంది. ట్రయల్ రన్‌లో భాగంగా నవంబర్ 2025 నుంచి ముడి నూనె ఉత్పత్తి ప్రారంభించగా సెప్టెంబర్ వరకు 74,847 మెట్రిక్ టన్నుల క్రషింగ్ జరిగింది. దీంతో 13,379 టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కాగా నూనె దిగబడి రేటు 18 శాతంగా నమోదైంది. క్రషింగ్ అనంతరం 7,591 టన్నుల గింజలు తీయగా 1,261 క్రూడ్ కర్నెల్ ఆయిల్ ఉత్పత్తి అయింది.


