పీఎస్‌ అప్‌గ్రేడ్‌ చేయరూ? | - | Sakshi
Sakshi News home page

పీఎస్‌ అప్‌గ్రేడ్‌ చేయరూ?

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

● ఎస్‌హెచ్‌ఓగా ఇన్‌స్పెక్టర్‌ అవసరం

● సీఐ, డీఎస్పీని కలవాలంటే 40 కిలోమీటర్లు

● జిల్లాలోనే హత్నూర అతిపెద్ద మండలం

హత్నూర(సంగారెడ్డి): పోలీస్‌శాఖలో కీలక మార్పులతో జిల్లాలోనే 38 పంచాయతీలతో పెద్ద మండల కేంద్రంగా విస్తరించిన హత్నూర ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. డీఎస్పీ, సీఐని కలవాలంటే సుమారు 40 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. హత్నూర, గుమ్మడిదల మండలాలను కలిపి సీఐ పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. పటాన్‌చెరు డీఎస్పీగా ఉన్న పోస్టింగ్‌ను జిన్నారం పోలీస్‌ సబ్‌డివిజన్‌గా ప్రకటిస్తూ హత్నూర మండలాన్ని జిన్నారం డీఎస్పీ పరిధిలో కలిపింది. పరిపాలన సౌలభ్యం కోసం బీడీఎల్‌ భానూర్‌ పరిధిలోని ఐలా పరిశ్రమ భవనంలో కొనసాగుతున్న పటాన్‌చెరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ భవనంలోకి కొత్త డీఎస్పీ కార్యాలయాన్ని మారుస్తున్నారు. దీంతో హత్నూర మండల ప్రజలు పోలీస్‌ ఉన్నతాధికారులను కలవాలంటే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జిన్నారం పోలీస్‌స్టేషన్‌ను ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ను ని యమించినట్లే హత్నూర పీఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, మండల పరిధిలో ఏడాదిలో సుమారు 250 నుంచి 300 వరకు క్రైం రేట్‌ ఉండటంతో ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని కోరుతున్నారు. కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి పోలీస్‌ డివిజన్‌ పరిధిలోకి హత్నూర పోలీస్‌స్టేషన్‌ను కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

హత్నూర పోలీస్‌స్టేషన్‌

పెరిగిన దూరభారం

హత్నూర పోలీస్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఎస్‌హెచ్‌ఓగా ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలి. డీఎస్పీ సంగారెడ్డి పరిధిలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీఐ, డీఎస్పీని కలవాలంటే సుమారు 45 నుంచి 50 కిలోమీటర్లు వెళ్లాలి. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం కూడా ఉంది.

– నాగ ప్రభుగౌడ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement