జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి
జహీరాబాద్ టౌన్: గర్భిణులు, చిన్నారులకు తగిన స్థాయిలో పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా సంక్షేమ అధికారిణి లలితకుమారి అన్నారు. జహీరాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా తక్కువ ఖర్చుతో లభించే ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా పలువురు గర్భిణులకు సీమంతం నిర్వహించి పోషకాహార కిట్లను అందజేశారు. చిన్నారులకు అన్నప్రాసన కూడా చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, సీడీపీఓ సుశీల, సూపర్‌వైజర్లు అనిత, ఐదు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీడింగ్ రూం (తల్లిపాల గది)ని మున్సిపల్ చైర్మన్ యూనూస్, డీఎం స్వామితో కలిసి డీడబ్ల్యూఓ ప్రారంభించారు.


