సందడి చేస్తున్న చిన్నారులు
శ్రామిక జన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు
జహీరాబాద్ టౌన్: వేసవి రావడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొంత మంది పిల్లలు బంధువుల ఇళ్లకు మరి కొందరు విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్లారు. ఇంకొందరు వేసవి శిబిరాల్లో చేరి తమ ప్రతిభను మరింత పెంచుకుంటున్నారు. జహీరాబాద్ శ్రామిక జన విజ్ఞాన కేంద్రం, మన లైబ్రరీ నిర్వాహకులు ‘వేసవి పిల్లల జాతర’ పేరిట వేసవి శిబిరాలను ప్రారంభించారు. ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తూ పిల్లలకు పలు అంశాల్లో తర్ఫీదును ఇప్పిస్తున్నారు. వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెల 10 వరకు..
ఎప్రిల్ చివరి వారంలో ప్రారంభమైన ఉచిత శిక్షణ శిబిరాలు మే 10 తేదీ వరకు కొనసాగనున్నాయి. జహీరాబాద్ నియోజవకర్గంలోని జహీరాబాద్ టౌన్, రాయికోడ్, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లోని 22 గ్రామాల్లో శిబిరాలు నడుస్తున్నాయి. ప్రతి సెంటర్‌లో 30 మంది వరకు పిల్లలు ఉన్నారు. శిక్షణ తరగతుల్లో ఆర్ట్స్ అండ్ క్రాప్ట్, గణిత నైపుణ్యం, పెయింటింగ్, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్, మట్టితో బొమ్మల తయారీ, పజిల్స్ పరిష్కారం, పేపర్‌తో కళాకృతుల తయారీ తదితర అంశాలపై నిపుణులు నేర్పిస్తున్నారు. పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నారు.
కొన్నేళ్ల నుంచి..
వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్‌కు పరిమితం కాకుండా వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉచిత శిబిరాలను కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించే శిబిరాలకు మంచి స్పందన వస్తుంది. దీంతో శిక్షణ కేంద్రాలను కూడా పెంచాం. వేసవి శిబిరాల వల్ల పిల్లల్లో దాగిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తల్లిదండ్రులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను సెంటర్లకు పంపించాలి.
–డాక్టర్ విజయలక్ష్మి, నిర్వాహకురాలు


