పంట మార్పిడితో రోజువారీ ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో రోజువారీ ఆదాయం

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

● ఆసక్తి కనబరుస్తున్న రైతులు ● రైతు బజార్‌ ఏర్పాటుకు డిమాండ్‌ రైతు బజార్‌ లేక ఇబ్బందులు

● ఆసక్తి కనబరుస్తున్న రైతులు ● రైతు బజార్‌ ఏర్పాటుకు డిమాండ్‌

సంప్రదాయ పంటలైన వరి, పత్తి తదితరాలు సాగు చేసి దిగుబడులు రాక నష్టపోతున్న రైతులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే రోజువారీ ఆదాయం లభించే కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్ల దాడి ఇలా ప్రతికూల పరిస్థితులతో సంప్రదాయ పంటలు నష్టాలు మిగులుస్తుండగా... కూరగాయలు మాత్రం సిరులు కురిపిస్తున్నాయని అన్నదాతలు పేర్కొంటున్నారు.

–అక్కన్నపేట(హుస్నాబాద్‌)

క్కన్నపేట మండలంలోని ధర్మారం, తుర్కనవానికుంట, కపూర్‌నాయక్‌ తండా, మైసమ్మ వాగుతండా, గండిపల్లి, శ్రీరాం తండా, రామవరం, గౌరవెల్లి, గుబ్బడి, పోతారం(జే), గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా శ్రీరామ్‌ తండా గ్రామపరిధిలోని బోరింగ్‌తండాకు చెందిన రైతు భూక్య రాజునాయక్‌ ఎకరంలో ఎనిమిది రకాల కూరగాయల పంటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. టమాట, పచ్చిమిర్చి, వంకాయ, కాకర, బెండకాయ, క్యాబేజీ, సొరకాయలతో పాటు పలురకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు.

మండలంలోని ధర్మారం, మసిరెడ్డి తండా, కపూర్‌నాయక్‌ తండా, తుర్కనవానికుంట గ్రామాలు కూరగాయలతో పాటు కొత్తిమీర సాగుకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. అయితే, పండించిన కూరగాయ పంటలను హుస్నాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట పట్టణాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించుకుంటున్నారు. మార్కెట్లకు తరలించేందుకు సరైన రవాణా సౌకర్యం లేక కొంతమంది రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. కాగా అక్కన్నపేట మండల కేంద్రంలో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తే చాలా గ్రామాల్లో కూరగాయల పంటలు పండించడానికి రైతులు ముందుకొస్తారని పలువురు రైతులు చెబుతున్నారు.

కూరగాయల సాగు మేలు..

నేను ఐదేళ్లుగా ఎకరంలో పలురకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నా. రోజు రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఆదాయం వస్తుంది. గండిపల్లి, రామవరం, బొత్తలపర్రె, హుస్నాబాద్‌ వారాంతపు సంతల్లో తీసుకెళ్లి అమ్ముకుంటున్నా. కూలీల ఖర్చు కూడా ఉండదు. మండల కేంద్రంలో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తే అనేక మంది రైతులు కూరగాయల సాగు వైపు అడుగులు వేస్తారు.

– భూక్య రాజునాయక్‌, బోరింగ్‌తండా, ఉప సర్పంచ్‌

Advertisement
 
Advertisement
Advertisement