న్యాల్‌కల్(జహీరాబాద్): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... మండల పరిధిలోని రేజింతల్ గ్రామానికి చెందిన పలువురు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారు. విశ్వసనీ య సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురి ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 4,150, మూడు సెల్‌ఫోన్లు, పేకాట ముక్కల ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
వ్యక్తి అదృశ్యం
జహీరాబాద్ టౌన్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన కోహీర్ మండలంలో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ వివరాల ప్రకారం... వెంకటాపూర్ గ్రామానికి చెందిన కలాలి నర్సింహులు గౌడ్(45) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకుంటానని గత నెల 30న ఉదయం ఇంటి నుంచి జహీరాబాద్ పట్టణానికి వెళ్లాడు. మధ్యాహ్నం భార్య సత్యమ్మ ఫోన్ చేయగా టౌన్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. తరువాత ఆయన ఫోన్ కలువకపోగా చీకటి పడినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో భార్య సత్యమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ మెడలో
బంగారు చైన్ చోరీ
రాయికోడ్(అందోల్): మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగుడు తెంపుకెళ్లాడు. ఈ ఘటన మండలంలోని రాయిపల్లి శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకిరణ్ వివరాల మేరకు... ఔరంగానగర్‌కు చెందిన కే.లక్ష్మి రాయిపల్లి గ్రామ శివారులో గొర్రెలు మేపుతోంది. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఆమెతో మాటామాట కలిపి కళ్లలో కారంపొడి కొట్టి మెడలో ఉన్న 30 గ్రాముల తాళిబొట్టు లాక్కొని వెళ్లాడు. సదరు చైన్ స్నాచర్ లైట్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ ప్యాంటు , సర్జికల్ మాస్క్ ధరించి ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు కారు పల్టీ..
ఇద్దరికి స్వల్ప, మరో ఇద్దరికీ తీవ్రగాయాలు
హుస్నాబాద్‌రూరల్: పందిళ్ల బ్రిడ్జి దగ్గర ఆదివారం ప్రమాదవశాత్తు కారు పల్టీలు కొట్టగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం... రాములపల్లికి చెందిన గంగం శ్రీధర్‌రెడ్డి కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో పందిళ్ల బ్రిడ్జి దాటిన తర్వాత కారు అదుపుతప్పి రోడ్డు కిందివైపు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రెడ్డి, అతని భార్య దివ్యతేజ, కొడుకు నిహారెడ్డి, కూతురు శ్రీనికకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో హుస్నాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.తీవ్రగాయాలైన దివ్యతేజ, నిహారెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
హార్వెస్టర్‌లో పడి..
తెగిన రైతు కాలివేళ్లు
కౌడిపల్లి(నర్సాపూర్): హార్వెస్టర్ మిషన్‌లో ప్రమాదవశాత్తు రైతు జారి పడటంతో కాలి వేళ్లు కట్ అయ్యాయి. ఈ సంఘటన మండలంలోని దేవులపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు వరికోత మిషన్ ద్వారా వరి కోస్తుండగా అదేగ్రామానికి చెందిన గడ్డమీది శ్రీశైలం మిషన్ కోసం వెళ్లి హార్వెస్టర్‌పై కూర్చున్నాడు. ఈ క్రమంలో అతడి కాలు చైన్‌లో పడటంతో ఐదువేళ్లు కట్ అయ్యాయి. దీంతో బాధితుడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


