పరిశ్రమలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలో అగ్ని ప్రమాదం

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

కొండాపూర్‌(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లి గ్రామ శివారులో గల హేమా ఇండస్ట్రీస్‌(ప్లైవుడ్‌)లో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. కొండాపూర్‌ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రావడంతో ఫైర్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్లైవుడ్‌ రా మెటీరియల్స్‌, ఫిల్లింగ్‌, ఫ్లష్‌ డోర్లు, యంత్రాలతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే పక్కనే ఉన్న గ్రీన్‌ క్రాఫ్ట్‌స్‌ కంపెనీకి కూడా మంటలు వ్యాపించి అక్కడి యంత్రాలు, స్టాక్‌తోపాటు ఇతర సామగ్రి దగ్ధమైంది. ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు.

మల్లుపల్లిలో పూరిగుడిసె దగ్ధం..

చిన్నశంకరంపేట(మెదక్‌): అగ్నిప్రమాదంలో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని మల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం గ్రామానికి చెందిన అరికెల రమేశ్‌ నివాస గుడిసె షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎగిసిపడిన మంటలతో పూర్తిగా పూరిగుడిసె దగ్ధమైంది. మెదక్‌ నుంచి ఫైర్‌ ఇంజన్‌ రావడంతో మంటలను పూర్తిగా ఆర్పారు. ఈ సంఘటనలో తులంన్నర బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదు, బియ్యం, బట్టలు, సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంభ సభ్యులు తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో గడ్డివాము..

మద్దూరు(హుస్నాబాద్‌): ప్రమాదవశాత్తు గడ్డి వాము దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని గాగ్గిళ్లాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేక లక్ష్మణ్‌ పశుగ్రాసం కోసం తన పొలంతో పాటు ఇతర రైతులను నుంచి సేకరించిన గడ్డిని కట్టలు చుట్టి బావి వద్ద పెట్టాడు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో గడ్డి వాము కాలిపోయింది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రత్నించినా అదుపులోకి రాకపోవడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది.

Advertisement
 
Advertisement
Advertisement