చిప్ప చేతపట్టుకొని ఎందుకొస్తున్నారు? | - | Sakshi
Sakshi News home page

చిప్ప చేతపట్టుకొని ఎందుకొస్తున్నారు?

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

ఇక్కడికొచ్చి నిధులిస్తలేరని తిడుతున్నరు తెలంగాణ నడుస్తోంది కేంద్రం నిధులతోనే.. కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఫైర్‌

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /సంగారెడ్డి ఎడ్యుకేషన్‌ /మెదక్‌జోన్‌: కాంగ్రెస్‌ మంత్రులు, సీఎం నిధులు ఇవ్వాలని చిప్ప చేతిలో పట్టుకొని ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడికి వచ్చి నిధులు ఇస్తలేరని తిడుతున్నారని, కేంద్రం వద్దకు మరి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశం కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని కందిలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో, మెదక్‌కు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో నడుస్తోందన్నారు. దేశంలోనే ఎక్కువ ధాన్యాన్ని తెలంగాణ నుంచి కేంద్రం కొనుగోలు చేస్తోందన్నారు. అలాగే రాష్ట్రానికే ఎక్కువ యూరియాను కేంద్రం కేటాయిస్తోందని వివరించారు. యుద్ధ సంక్షోభం సమయంలోనూ పెట్రోల్‌ ధరలు పెంచని ఏకై క దేశం ఇండియానే అన్నారు. మహిళా బిల్లు రావడం కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. ఈ నెల 10న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారని, పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీపాటిల్‌, మాజీ ఎమ్మెల్యే బాల్‌రాజు, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి అబయ్‌ పటేల్‌, మెదక్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, శివ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement