పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని యూసుఫ్‌పేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన శ్రీరాం సాయిలు భార్య అనుసూయ ఏడాది క్రితం క్యాన్సర్‌తో చనిపోయింది. ఇతనికి కూతురు, కొడుకు ఉన్నారు. ఇటీవలె కూతురు పెళ్లి చేశాడు. అయితే కొంత కాలంగా భార్య లేకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారం ఉదయం పొలం వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. కొడుకు సాయిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో..
వర్గల్(గజ్వేల్): ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని తున్కిఖాల్సా లో చోటు చేసుకుంది. గౌరారం ఏఎస్‌ఐ రుక్కమ్మ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తుడుం వెంకటేశ్(30)కు భార్య నందిని, తొమ్మిదేళ్లలోపు తేజస్విని, అవంతిక, వెన్నెల ముగ్గురు కుమార్తెలున్నారు. వ్యవసాయం, కూలీపనుల తో దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఏడాది క్రితం వారు కొత్తగా నిర్మించుకున్న ఇంటికి రూ.10 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పు భారంగా మారడం, ఆర్థిక ఇబ్బందులతో వెంకటేశ్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో దూలానికి చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
ఝరాసంగం(జహీరాబాద్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... జీర్లపల్లి గ్రామానికి చెందిన సంగప్ప (52) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వల తీసుకొని వెళ్లాడు. చెరువులో వేసిన వల ప్రమాదవశాత్తు కాలికి తగిలి నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందా డు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు.


