గవ్వలపల్లిలో భైరవ శిల్పం గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

గవ్వలపల్లిలో భైరవ శిల్పం గుర్తింపు

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

గవ్వలపల్లిలో భైరవ శిల్పం గుర్తింపు నేడు మెగా జాబ్‌ మేళా గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం బైక్‌లో నాగుపాము..

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయుల శైలికి చెందిన అరుదైన తాంత్రిక భైరవ శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిల్పంలో భైరవుడు జ్యాలకేశాలతో కపాలమకుటం ధరించి చెవులకు పెద్ద కుండలాలు, మెడలో సర్పహారం, భుజాలపై కేయురాలు, కపాలమాల, కపాలమేకలు, కాళ్ల కడియాలు, పాంజిబులతో ఎత్తులు కట్టిన పాదుకలతో ఉన్నాడని చెప్పారు. త్రిభంగిమలో వైతస్తిక పాదాలతో నిలబడిన ఈ చతుర్భుజ భైరవుడు పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలం, నిజహస్తాల్లో ఖడ్గం, రస్తపాత్రలతో స్థానక శిల్పంగా కన్పిస్తున్నాడని తెలిపారు. గతంలో అరుదైన వినాయకుడు ఉన్న శివాలయంలోనే భైరవుడి శిల్పాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.

జహీరాబాద్‌: జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అస్లాం ఫారూఖీ తెలిపారు. జహీరాబాద్‌లోని ఫౌండేషన్‌, సదాశివపేటలోని అరిన్‌ ఫార్మాస్యూటికల్స్‌, దిగ్వాల్‌లోని పిరామల్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే మేళాలో మహీంద్రా మోటార్స్‌, ఫ్లిప్‌కార్ట్‌, శ్రీరాంచిట్స్‌, క్రెడిట్‌ యాక్సెస్‌ హెచ్‌ఆర్‌ స్వ్కేర్‌ వంటి సంస్థలు, ఫార్మా బ్యాంకింగ్‌, లాజిస్టిక్‌, ఇ–కామర్స్‌, మార్కెటింగ్‌ మరియు ఇతర విభాగాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కోహీర్‌, సదాశివపేట, సంగారెడ్డిలోని అన్ని కళాశాలల విద్యార్థులతో పాటు ఇతర కళాశాలల నుంచి ఉత్తీర్ణులైన వారు కూడా మేళాకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని హుగ్గెల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ.కాశీనాథ్‌ వివరాల ప్రకారం... సుమారు 50 సంవత్సరాల వయసు కల్గిన మహిళ శవం జాతీయ రహదారి పక్కన ఓ గుంతలో కనిపించింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. మృతదేహాన్ని జహీరాబాద్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భయంతో పరుగులు

కౌడిపల్లి(నర్సాపూర్‌): బైకులో పాము కనిపించడంతో వాహనదారుడు ఆందోళనకు గురయ్యాడు. విషయం ఇతరులకు చెప్పి పామును బైక్‌ నుంచి వెళ్లగొట్టగా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం కౌడిపల్లి మండలం కూకుట్లపల్లిలో జంగ ప్రశాంత్‌ తన పల్సర్‌ బైక్‌ను సాయంత్రం ఇంటిముందు పార్కు చేశాడు. బయటకు వెళ్లేందుకు బైక్‌ తీసే క్రమంలో నాగుపాము కనిపించింది. దీంతో ప్రాణం అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో కర్రతో శబ్ధం చేసి నాగుపామును బైకు నుంచి వెళ్లగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement