లాభాల ‘పట్టు’! | - | Sakshi
Sakshi News home page

లాభాల ‘పట్టు’!

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

లాభాల ‘పట్టు’! ● మారుతున్న రైతుల తీరు ● సిల్క్‌ సమగ్ర పథకం కింద రాయితీలు

మల్బరీ సాగుపై ఆసక్తి
● మారుతున్న రైతుల తీరు ● సిల్క్‌ సమగ్ర పథకం కింద రాయితీలు

జహీరాబాద్‌ టౌన్‌: ఒక్కసారి సాగు చేస్తే ఏళ్ల తరబడి పంట తీసుకునే అవకాశం ఉండటంతో రైతులు మల్బరీ తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పట్టు వల్ల లాభాలు వస్తున్నాయని తోటల పెంపకానికి ముందుకు వస్తున్నారు. సమగ్ర సిల్క్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుండటంతో జిల్లాలో మల్బరీ తోటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 2026–27 ఆర్థిక ఏడాదిలో మల్బరీ తోటల సాగు పట్టు పురుగుల పెంపకం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. జిల్లాలో 150 ఎకరాల్లో సాగవుతుండగా మరో 70 ఎకరాల్లో సాగు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వం ఇస్తున్న రాయితీల గురించి వివరిస్తున్నారు.

చీడపీడల బెడద లేని పంట

మల్బరీ మొక్కలను ఒకసారి నాటితే నిరంతరం కాపు వస్తుంది. చీడపీడల బెడద ఉండదు. ప్రారంభంలో షెడ్డు తదితరాలకు పెట్టుబడి అవసరముంటుంది. ఆ తర్వాత గుడ్లను కొనటం, మందు ద్రావణం, కూలీలు తదితర చిన్నచిన్న పెట్టుబడులు మాత్రమే ఉంటాయి. ఏడాదిలో 6 నుంచి 8 సార్ల వరకు కాపు తీసుకోవచ్చు. 100 గుడ్లకు 80 కిలోల వరకు పట్టు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పట్టు ధర రూ.650 వరకు ఉంది. 25 నుంచి 35 రోజులకొక పంట పూర్తవుతుండగా ఖర్చులు పోను ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం లభిస్తుంది.

రాయితీలు ఇలా...

సిల్క్‌ సమగ్ర పథకం ద్వారా మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకానికి పలు రాయితీలు ఇస్తోంది. రైతులకు రెండెకరాల మల్బరీ సాగుకు రూ.60 వేలు ఇస్తుండగా ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.78 వేలు ఇస్తుంది. నీటి సౌక్యరానికి రూ.50 వేలు ఇతరులకు రూ.65 వేలు, పట్టుపురుగులను పెంచడానికి షెడ్డు నిర్మాణం కోసం రూ.4.50లక్షల నుంచి రూ.6.5 లక్షలు ఖర్చవుతుంది. షెడ్డు నిర్మాణానికి సాధారణ రైతులకు రూ.2.25లక్షలు, ఎస్సీ,ఎస్టీలకు రూ.2.92 లక్షలు కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. షెడ్డులో అమర్చే సామగ్రికి రూ.37,500, రోగ నిరోధక మందులకు రూ.2,500 నుంచి రూ.3,250 చొప్పున నిధులు ఇస్తున్నారు.

మల్బరీ తోటల సాగుపై దృష్టి పెట్టాలి

రైతులు భిన్న పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. ఆయిల్‌పామ్‌తోపాటు పట్టుపురుగుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పంటల మార్పిడి అన్ని విధాలుగా మేలు. లాభాలు వచ్చే మల్బరీ తోటల సాగు చేపట్టాలి. పట్టుకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా ఉంది. సాగు కోసం ప్రభుత్వాలు పలు రాయితీలు ఇస్తుంది. రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి. మల్బరీ తోటల సాగుకు ఎలాంటి సహకారాలు అవసరం ఉన్న 9618510799 నంబర్‌ను సంప్రదించాలి.

– సోమేశ్వర్‌రావు, జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement