అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు
పటాన్‌చెరు టౌన్: జిల్లాలోని పరిశ్రమలు, నివాస, విద్యా, వాణిజ్య సంస్థల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. పటాన్‌చెరు, ఐడీఏ పాశమైలారంలోని న్యూల్యాండ్ లేబోరేటరీస్ లిమిటెడ్, యూనిట్–ఐఐ, ఎం ఎస్ క్రామ్సన్ రీసెర్చ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో మంగళవారం స్థానిక స్టేషన్ అగ్నిమాపక అధికారి వెంకట్‌నాగేంద్ర కలసి తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ..ప్రతీ వారం ముందస్తు సమాచారం ఇచ్చి సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బీసీ) ప్రకారం అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, నిర్వహణ, సక్రమ పనితీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించనున్నామన్నారు.
పర్యటించి.. పరిశీలించి
గ్రామీణ జీవన విధానంపై జపాన్ బృందం అధ్యయనం
హత్నూర(సంగారెడ్డి): గ్రామాలు, తండాల్లో ప్రజల జీవన విధానంపై జపాన్ ప్రతినిధులు మంగళవారం మధ్యాహ్నం అధ్యయనం చేశారు. హత్నూర మండలం సిరిపుర, తెల్లరాళ్ల తండా, జగంపేట గ్రామాలలో పర్యటించి ఆధునిక వ్యవసాయం, అధునాతన టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ పాఠశాలల పనితీరు తదితర అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు సేవలు, యూపీఐ వాడకం, ఇంటర్నెట్ వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేశారు. కార్యక్రమంలో నెక్ట్స్ భారత్ సుజూకీ ఇన్నోవేషన్ సెంటర్ ప్రతినిధులు చార్మినియా, టెక్కిచు, మరియుమాతోపాటు సర్పంచ్‌లు ఉపసర్పంచ్‌లు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనపూర్ ఆయకట్టుకు సింగూరు జలాలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం
పాపన్నపేట(మెదక్): సింగూరు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు వెంటనే 0.03 టీఎంసిల సాగు నీరు విడుదల చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడే నాటికే ఘనపూర్ ఆయకట్టు రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం ఇవన్నీ పొట్ట దశలో ఉన్నాయి. సాగు నీరు విడుదల చేయక పోవడంతో పంటలు ఎండు ముఖం పట్టాయి, దీంతో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, సర్పంచ్‌లు కాశినాథ్, బద్రి మల్లేశం, కొడుపాక, ఎంకెపల్లి, నాగ్సాన్‌పల్లి, గాజుల గూడెం, చిత్రియాల్ రైతులు మంగళవారం నాంపల్లిలోని మానవ హక్కుల సంఘం కార్యాలయానికి వెళ్లి సింగూరు నుంచి నీరు విడుదల చేసి పంటలను రక్షించాలని కోరారు. ఘనపురం ఆయకట్టుకు సింగూరు నుంచి వెంటనే 0.03 టీఎంసీల నీరు విడుదల చేయాలని హెచ్‌ఆర్సీ చైర్మన్ షమీం అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.


