● మూడేళ్లుగా పట్టిపీడిస్తున్న డ్రైనేజీ సమస్య ● మరమ్మతు పనులను అడ్డుకుంటున్న మాజీ ప్రజాప్రతినిధి! ● సమస్య పరిష్కరించాలని స్థానికుల ఆందోళన
జోగిపేట(అందోల్): మూడేళ్లుగా తమను పట్టి పీడిస్తున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో అందోలు గూడెం డబుల్ బెడ్ రూం నివాసులు ఆందోళన చేపట్టారు. అందోలు గూడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం వద్ద డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో గత మూడేళ్లుగా నివాసితులు నరకాన్ని చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డ్రైనేజీ పనుల నిర్మాణానికి మంజూరైన రూ.1.52 కోట్లతో పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసే పనులను గత సోమవారం ప్రారంభించారు. అయితే ఈ కాంట్రాక్టు తనకు దక్కలేదన్న కోపంతో స్థానిక మాజీ ప్రజాప్రతినిధి ఇరుగుపొరుగు వారితో కలసి పనులను మధ్యలోనే అడ్డుకుంటున్నట్లు డబుల్ బెడ్రూం నివాసులు ఆరోపిస్తున్నారు. పనులు నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై బైఠాయించారు. చైర్మన్, కమిషనర్లు రావాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ దుర్గయ్య పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకుని నచ్చజెప్పినా వినిపించుకోకుండా ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ అధికారులు వచ్చి రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.
భోజనం కూడా చేసే పరిస్థితి లేదు
తమకు మూడేళ్ల క్రితం డబుల్ బెడ్‌రూంలను కేటాయించారని, డ్రైనేజీ నీళ్లు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయకపోవడంతో డబుల్‌బెడ్‌రూం చుట్టూ పెద్ద గుంతలుగా ఏర్పడి మురికినీరంతా చేరిపోయిందని స్థానికులు చెబుతున్నారు. పరిసర ప్రాంతాలతో పాటు గదుల్లోకి కూడ దుర్వాసన వస్తుండటంతో కనీసం భోజనం కూడా చేసే పరిస్థితి లేదని వివరించారు. కొన్ని గదుల్లోకి మురికినీరు కూడా వచ్చి చేరుతుందని చెప్పారు. పెద్ద గుంతగా ఏర్పడి మురికి నీరు నిలిచిపోవడంతో చిన్న పిల్లలు అనారోగ్యానికి గురికావడమే కాకుండా ఒకరిద్దరు అనారోగ్యంతో మరణించిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


