● 24 నుంచి వేసవి సెలవులు
● జూన్ 12న బడులు పునఃప్రారంభం
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం నుంచి ఎస్‌ఏ–2 (వార్షిక) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు 6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు జరగనుండగా, 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలను రెండు రోజులుగా ఆయా మండలాల పరిధిలోని ఎమ్మార్సీల నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వార్షిక పరీక్షలు ముగిసిన అనంతరం ఏప్రిల్ 23న విద్యార్థులకు మార్కుల పట్టికలు (ప్రొగ్రెస్ కార్డులు) అందించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి వచ్చే జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని అధికారులు తెలిపారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
వైద్య పరీక్షలు తప్పనిసరి
ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్: ప్రస్తుత కాలంలో జీవనశైలి మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరు ఆరోగ్యం శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా
ఉంచుకోవాలి
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి
సంగారెడ్డి: చిన్న చిన్న వ్యాపారస్తులు తమ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని ఐబీ దగ్గర ఉన్న పూలషాపుల దుకాణదారులు మంగళవారం చెత్తను రోడ్డుపై పడవేయగా గమనించిన శ్రీనివాస్‌రెడ్డి ఆ చెత్తను వారితోనే తీయించి శుభ్రం చేయించారు. అదేవిధంగా సువర్ణ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న అపోలో ఫార్మసీ నిర్వాహకులు సైతం పారవేసిన చెత్తను సదరు షాపు నిర్వాహకులతోనే తీయించి చెత్త సేకరించే వాహనంలో వేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..ఎవ్వరూ చెత్తను రోడ్లపై వేయొద్దని హెచ్చరించారు.
అనధికార లేఅవుట్లలో
సరిహద్దురాళ్ల తొలగింపు
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా వేసిన పలు లేఅవుట్లలోని ప్లాట్లకు సంబంధించిన హద్దురాళ్లను కమిషనరు జగ్జీవన్ ఆదేశాల మేరకు సిబ్బంది మంగళవారం జేసీబీతో తొలగించారు. అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నాకే నిబంధనల మేరకు లేఅవుట్లు వేయాలని కమిషనర్ సూచించారు. అనుమతులు లేకుండా వేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


