19 అక్రమ సిలిండర్ల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

19 అక్రమ సిలిండర్ల స్వాధీనం

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

19 అక్రమ సిలిండర్ల స్వాధీనం బైక్‌, మోపెడ్‌ ఢీ.. అటవీ ప్రాంతంలో మంటలు ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు

బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేటలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన వివిధ ఏజెన్సీలకు చెందిన 19 గ్యాస్‌ సిలిండర్లను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్‌ఓ తనూజ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా సిలిండర్లు లభించాయన్నారు. రెండు కంటే ఎక్కువ సిలిండర్లు నిల్వ ఉంచరాదని స్పష్టం చేశారు. అక్రమంగా సిలిండర్లను నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎంఓ శివరంజని, తదితరులు పాల్గొన్నారు.

మోపెడ్‌లో సంభవించిన మంటలు

నర్సాపూర్‌: బైక్‌, మోపెడ్‌ ఢీకొన్న ఘటనలో మోపెడ్‌కు మంటలంటుకున్నాయి. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లికి చెందిన ముత్యాలు మోపెడ్‌పై నర్సాపూర్‌కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ శివారులోని ఫైర్‌ స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై చైతన్యపురికి చెందిన మైనర్‌ బాలుడు బైక్‌పై వచ్చి ఢీకొట్టడంతో మోపెడ్‌ కిందపడగానే మంటలు సంభవించాయి. కాగా పక్కనే ఉన్న ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. కాగా మోపెడ్‌ కొంత పాడైనట్లు ముత్యాలు వాపోయాడు.

మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని కాసులాబాద్‌ గ్రామం నుంచి హబ్సీపూర్‌కు వెళ్లే అటవీ ప్రాంతంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడటంతో పరిసర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అడవిలో మంటలు వేగంగా వ్యాపిస్తున్న దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా? లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా? అనే దానిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పాత నేరస్తుడి అరెస్టు

సిద్దిపేటకమాన్‌: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం సిద్దిపేట టూటౌన్‌ సీఐ ఉపేందర్‌ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని హనుమాన్‌ నగర్‌కు చెందిన బర్మా వెంకటేశ్‌ గతంలో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. అప్పట్లో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో వెంకటేశ్‌ జైలుశిక్ష పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితుడిలో మార్పు రాలేదు. సదరు బాలిక ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా ఆమె స్నేహితులకు పంపించాడు. అంతేకాకుండా గతంలో తనపై నమోదైన కేసులోని సాక్షులను భయబ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement