పింఛన్‌.. టెన్షన్‌..! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌.. టెన్షన్‌..!

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

ప్రగతి ప్రణాళికలో దండిగా దరఖాస్తులు

1.52 లక్షల మంది లబ్ధిదారులు

ప్రగతి ప్రణాళికలో దండిగా దరఖాస్తులు

అధికారులు, నేతల చుట్టూ చక్కర్లు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కొత్త పింఛన్ల మంజూరు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం 99 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను చదివి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, రేషన్‌కార్డులు పొందిన వారి వివరాలు ఇలా అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామసభల్లో చదువుతున్నారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల కోసం ఆయా గ్రామాల్లోని అర్హులైన వారు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో గ్రామానికి కనీసం 70 నుంచి వంద వరకు పింఛన్ల దరఖాస్తులు వస్తున్నాయని పంచాయతీ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో ఏకంగా 150 నుంచి 200 వరకు దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. అయితే కొత్త పింఛన్లు మంజూరు కాక చాలా సంవత్సరాలు గడుస్తోంది. చివరిసారిగా 2022 ఆగస్టు 31న పింఛన్లు మంజూరయ్యాయి. దాదాపు నాలుగు సంవత్సరాలుగా పింఛన్ల దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. దీంతో చాలా మంది అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదు. దీనికితోడు 57 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. వృద్ధాప్య పింఛన్లతో పాటు, వితంతు, దివ్యాంగుల పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇలా 647 గ్రామ పంచాయతీల్లో సగటున కనీసం 50 దరఖాస్తుల చొప్పున సుమారు 32 వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అనధికారిక అంచనా.

పోర్టల్‌లో నమోదు

పింఛన్లు మంజూరు కావాలంటే వచ్చిన దరఖాస్తులను చేయూత పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోర్టల్‌లో ప్రస్తుతానికి కొత్త పింఛన్ల దరఖాస్తులను నమోదు చేసే ఆప్షన్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో వచ్చిన దరఖాస్తులను ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు తమ వద్ద ఉంచుకునే పరిస్థితి నెలకొంది. కొందరు కార్యదర్శులు వాటిని ఎంపీడీఓ కార్యాలయానికి పంపుతున్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తుల వివరాలు నమోదు చేయడానికి ఆప్షన్‌ ఇచ్చినప్పుడు ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని గ్రామ కార్యదర్శులు పేర్కొంటున్నారు.

ఈ కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారు ప్రజాప్రతినిదులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగేళ్లుగా కొత్త వారికి అవకాశం కల్పించకపోవడంతో ఈ పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు తప్పడం లేదు. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగి, సభలు, సమావేశాలు జరిగినా ఈ దరఖాస్తు దారులు దరఖాస్తు ఫారాలతో వచ్చి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

ఒక్కో గ్రామంలో కనీసం 50 నుంచి వంద వరకు అప్లికేషన్లు

నాలుగేళ్లుగా నిలిచిపోయిన కొత్త పింఛన్ల మంజూరు

అర్హులైన లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురు చూపులు

జిల్లాలో ప్రస్తుతం 1.52 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ.36.02 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్లు 56 వేలు ఉండగా, దివ్యాంగుల పింఛన్లు 14 వేలు ఉన్నాయి. వితంతు పింఛన్లు 69 వేలు ఒంటరి మహిళా పింఛన్లు 7,300, ఏఆర్‌టీ పింఛన్లు 3,100 వరకు ఉంటాయి. మిగిలినవి బీడీకార్మిక, వీవర్స్‌, గీత కార్మికలు, ఫైలేరియా, డయాలసిస్‌ వంటి పింఛన్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement