వట్‌పల్లి(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ ప్రారంభమైనప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. సమగ్ర భూ రికార్డుల నిర్వహణ, పారదర్శకత కోసం డిజిటల్ ల్యాండ్, రికార్డులు మేనేజ్ మెంట్ సిస్టంగా ఉండేలా ధరణి స్థానంలో ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా వట్‌పల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఈ పోర్టల్‌ను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రారంభంకాలేదు. భూభారతి పోర్టల్ ప్రారంభమైన మొదటి, రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ అయిన వాటిని పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేశారు. సోమవారం మాత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఒక్కరోజు 22 స్లాట్‌బుక్‌లు ఉన్నప్పటికీ భూభారతి పోర్టల్ పనిచేయకపోవడంపై రిజిస్ట్రేషన్లు కాలేదు. దీంతో రైతులు గంటలకొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్లు కాకపోవడంపై రైతులు చేసిదేమిలేక సాయంత్రానికి నిరాశతో వెనుదిరిగారు. స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ భూభారతి పోర్టల్ మారనందున రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
భూభారతిలో నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
పైలట్ ప్రాజెక్టు కింద వట్‌పల్లి ఎంపిక


