వరించిన పురస్కారం | - | Sakshi
Sakshi News home page

వరించిన పురస్కారం

Nov 3 2025 4:29 PM | Updated on Nov 3 2025 4:29 PM

వరించిన పురస్కారం

వరించిన పురస్కారం

మహిళా రైతులకు జీనోమ్‌ సేవియర్‌ కమ్యూనిటీ అవార్డు

మాచ్‌నూర్‌లో విత్తన బ్యాంకు నిర్వహణ మహిళా రైతుల వద్ద సొంత విత్తనాలే!

డీడీఎస్‌ సంఘాల సభ్యులు చిరుధాన్యాలే సాగు

జహీరాబాద్‌: నాలుగు దశాబ్దాలుగా మహిళా రైతులు చిరుధాన్యాల సాగు, సంరక్షణ కోసం చేస్తున్న కృషికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. చిరు ధాన్యాలను సాగు చేయడమే కాకుండా సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నందుకు 2022–23 ఏడాదికిగాను ప్లాంట్‌ జీనోమ్‌ సేవియర్‌ కమ్యూనిటీ అవార్డు దక్కింది. జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌ గ్రామంలోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) సంస్థ తరఫున మహిళా రైతులంతా కలిసి మాచ్‌నూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసుకు న్న విత్తన భాండాగారం (సీడ్‌ బ్యాంక్‌)కు సామూహిక అవార్డు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ప్లానిక్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ప్లాంట్‌ వైరెటీస్‌ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌(పీపీవీఎఫ్‌ఆర్‌ఏ) అవార్డును ఇటీవల ప్రకటించింది. ఈనెల 12న ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా మహిళా రైతులు సామూహికంగా అవార్డు అందుకోనున్నారు.

70 గ్రామాల్లో విత్తన సంరక్షణ

మహిళా రైతులు తమ పొలాల్లో నాటుకునేందుకు సొంత విత్తనాలే వాడుతారు. పంట చేతికి అందగానే అందులోని నాణ్యమైన పంటను విత్తనంగా సేకరించి నిల్వ పెట్టుకున్నారు. విత్తనాలు వేసే సమయానికి వాటిని బయటకు తీస్తారు. జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, రాయికోడ్‌ మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లో డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) సంఘంలోని మహిళా రైతులు తమకు అవసరమైన మేరకు ప్రతి ఏటా చిరు ధాన్యాల విత్తనాలు నిల్వపెట్టుకుంటారు. ఎంపిక చేసుకున్న విత్తనాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు బూడిద, వేపాకు కలిపి ఈత బుట్టల్లో పోసి మట్టితో మూసివేస్తారు. విత్తనాలు పెట్టే సమయంలో వాటిని బయటకు తీసివిత్తనంగా ఉపయోగిస్తారు. సుమారు 50 నుంచి 70 రకాల వరకు విత్తనాలను నిల్వచేసి పెట్టుకుంటారు. సాయిజొన్న, పచ్చజొన్న, తీపి జొన్న, గుండు జొన్న, తోక జొన్న, సజ్జ, కొర్ర, తైద, సామ, శనగ, ఆర్గులు, పెసర, మినుము, అవిశ, కందులు, కోడిసామ, ఎవ్వలు ఇలా అనేక రకాల విత్తనాలను సేకరించి పెట్టుకుంటారు. ఆయా పంటలన్నీ వర్షాకాలంలో వర్షాధారంగా, యాసంగిలో తేమ ఆధారంగా పండే పంటలను రైతులు సాగు చేసుకుంటారు. అవసరం ఉన్న తోటి రైతులకు కూడ వాటిని అందజేస్తారు.

మాచ్‌నూర్‌లో విత్తన బ్యాంకు

ఝరాసంగం మండలంలోని మాచ్‌నూర్‌ గ్రామంలో డీడీఎస్‌ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల విత్తన బ్యాంకును ఏర్పాటు చేశారు. రెండు వేల మంది మహిళా రైతులు కలిసి దీన్ని కమ్యూనిటీ విత్తన కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఈ విత్తన బ్యాంకులో 60 రకాల వరకు విత్తనాలు రైతులకు అన్ని రకాలు కలిపి సుమారు 20 క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచుతారు. అవసరం అయిన రైతులు విత్తన బ్యాంకును సంప్రదించి విత్తనాలు పొందుతారు. పంట చేతికి రాగానే విత్తన బ్యాంకులో రైతులు తీసుకున్న విత్తనాన్ని తిరిగి అందజేస్తారు.

నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి దక్కిన అవార్డు

భావితరాలకు అందించాలని..

అంతరించి పోతున్న చిరుధాన్యాలను సంరక్షించి వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో తమ ప్రయత్నం సాగుతోంది. మహిళా రైతులు గ్రామాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచుకుంటున్నారు. అవసరం అయిన వారికి సరఫరా చేయాలనే ఉద్దేశంతో చిరుధాన్యాల విత్తన బ్యాంకు కూడా నిర్వహిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకెళ్తుంటారు. తమ పనికి అవార్డుతో గుర్తింపు వచ్చింది. –చంద్రమ్మ, రైతు, విత్తన బ్యాంకు నిర్వాహకురాలు– బిడకన్నె

దేశంలోనే పాత విత్తన బ్యాంకు

విత్తనాలు సంరక్షించుకునే ప్రక్రియ దేశంలో బాగా తగ్గిపోతోంది. తమ పనితనాన్ని పీపీవీఎఫ్‌ఆర్‌ఏ సంస్థ గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం సంతోషకరమైన విషయం. నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి ఇది ఫలితం. ఒక యూనివర్శిటీ వారు చేస్తున్న అధ్యయనంలో పాత విత్తన బ్యాంకులు, దేశంలో విత్తన బ్యాంకులు ఏమున్నాయని పరిశీలించారు. 600లకు పైగా విత్తన బ్యాంకులపై స్టడీ చేస్తే అన్నింటికన్నా పాత విత్తన బ్యాంకు డీడీఎస్‌ సంస్థదే అని తేలిందన్నారు. ఈ మేరకు అవార్డు రావడం సంతోషంగా ఉంది.

– దివ్య, డీడీఎస్‌ నిర్వాహకురాలు–జహీరాబాద్‌

అవార్డు రావడం సంతోషంగా ఉంది

విత్తనాలను సంరక్షిస్తున్నందుకు మహిళా రైతులకు కమ్యూనిటీ అవార్డు రావడం సంతోషంగా ఉంది. నాలుగు దశాబ్దాలుగా తాము చేస్తున్న కృషికి గుర్తింపు వచ్చినట్లయింది. అవార్డు మరింత బాధ్యతను పెంచినట్లయింది.

–లక్ష్మమ్మ, రుక్మాపూర్‌, విత్తన బ్యాంకు నిర్వాహకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement