వెచ్చని నేస్తం ఉన్ని వస్త్రాలు
చలి తీవ్రతతో పెరిగిన వ్యాపారం
● జోరందుకున్న ఉన్ని వస్త్రాల విక్రయాలు ● రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వలస వ్యాపారులు
జోగిపేట(అందోల్): చలి పెరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి రక్షణకల్పించేవి ఉన్ని దుస్తులే. శరీరాన్ని చలినుంచి కాపాడే ఈ దుస్తులు ఇప్పుడు కేవలం అవసరమే కాక ఫ్యాషన్‌గా కూడా మారాయి. రగ్గులు, స్వెటర్లు, జాకెట్లు, శాలువాలు ప్రతీ ఇంటిలో ఇప్పుడు తప్పనిసరైపోయాయి. జోగిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరువు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్ల పక్కన చిన్నచిన్న దుకాణాలు, తాత్కాలిక స్టాళ్లు వెలిశాయి. అక్కడ చలిని తరిమే ఉన్ని దుస్తులతోపాటు పిల్లల కోసం ఆకర్షణీయమైన డిజైన్ల స్వెటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చైనీస్, కశ్మీరీ, లడఖ్ ఉలెన్ దుస్తులు కూడా ఈసారి మంచి డిమాండ్ పొందుతున్నాయి. ప్రతీ ఏటా నవంబర్ తొలివారంలో అమ్మకాలు ఊపందుకుంటాయి. రాత్రిళ్లు చల్లగా మారగానే జనాలు పెద్దఎత్తున కొనుగోళ్లు చేస్తారు. రంగు, డిజైన్, నాణ్యతలతో కొత్త మోడళ్లు మార్కెట్లో వస్తున్నాయి. ప్రజలు కూడా చలిని తట్టుకునేందుకు రగ్గులు, రగ్గు స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువాలు, మంకీ క్యాప్‌లు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాసులు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టణాల్లో రోడ్డుకిరువైపులా షెడ్లు వేసి విక్రయిస్తున్నారు. రెడీమేడ్ షాపింగ్‌మాల్‌లో స్వెటర్లు లభిస్తున్నా పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలు రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసిన షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు.
గ్రామీణ ఉపాధికి కూడా ఊతం
చలి దుస్తుల తయారీలో చాలామంది మహిళలు కూడా భాగస్వాములవుతున్నారు. చేతిపని ద్వారా నూలు నేసి తయారు చేసే ఉన్ని దుస్తులు మంచి ఆదాయ వనరుగా మారాయి. గ్రామీణ మహిళల స్వయం సహాయక సంఘాలు కూడా ఇప్పుడు ఈ రంగంలో చురుగ్గా ఉన్నాయి.
ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు
ఎక్కువ రోజులు ఉండాలంటే...
ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాషింగ్ మెషీన్ లో వేయకూడదు. రెండు రోజులకోసారి చేతితో ఉతక డం మేలు. మరకలు పడ్డప్పుడు డ్రైక్లీనింగ్ చేయించుకోవాలి. ఉన్ని వస్త్రాలను తీగలపై ఆరేయకూడదు. అలా చేస్తే అవి సాగిపోయే అవకాశం ఉంది. ఎక్కువ ఎండ తగలకుండా చూడాలి.
–కరణ్, విక్రయదారుడు (మధ్యప్రదేశ్)


