కష్టపడి చదివితేనే విజయం
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: ప్రతీ విద్యార్థి కష్టపడి చదివితేనే విజయం లభిస్తుందని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తుకు రూరల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాలానికనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తుపై పట్టు సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని, అందుకనుగుణంగా కృషి చేయాలన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయని వివరించారు. జిల్లాలో మహిళల భద్రతకు పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. మహిళల రక్షణ చర్యల్లో భాగంగా షీటీమ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు భరోసానిస్తూ భరోసా సిబ్బంది అన్ని రకాల సేవలను ఒకేచోట అందిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి చిన్న పిల్లలకు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సైబర్ మోసాల గురించి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల ఇన్‌చార్జిలు వైద్యులు హిమబిందు, శుహిత, అర్వింద్, ప్రేమ్‌పాల్, మయుఖ్ పహారి, రూరల్ డెవలప్‌మెంట్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ సతీశ్ పాల్గొన్నారు.


