అప్రమత్తతే.. సురక్షితం
ఇవి చేయొద్దు..
● వినియోగంపై అవగాహన కరువు
● నిర్లక్ష్యం..పెను ప్రమాదానికి కారణం
● జాగ్రత్తలు పాటిస్తే మేలు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): వంటగ్యాస్ జీవనంలో భాగమైంది. కానీ నిర్తక్ష్యం చేస్తే అదే ప్రాణాంతకంగా మారుతుంది. గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సిలిండర్ లీకేజీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొన్ని చోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఈ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని ఆధికారులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని ఘటనలు
ఇటీవల భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ కాలనీలో గ్యాస్ లీకై ప్రమాదం జరిగి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. రామచంద్రాపురం పట్టణంలో కూడా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగి ఇళ్లు కూలిపోయింది. అలాగే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌లీకేజీతో ప్రమాదం చోటుచేసుకుంది.
అవగాహన లేకే..
వంటగ్యాస్ సిలిండర్ వినియోగంలో ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ వాడకంపై వినియోగదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
● పలు సూచనలు పాటిస్తే గ్యాస్ ప్రమాదాలను నివారించవచ్చుని నిపుణులు చెబుతున్నారు.
● ఐఎస్‌ఐ మార్క్ ఉన్న పైపులు, రెగ్యులేటర్లు, స్టవ్‌లు మాత్రమే వాడాలి.
● పైపును తరచుగా పరిశీలించి పగుళ్లు గమనిస్తే వెంటనే కొత్త పైపు వేసుకోవాలి.
● వంట పూర్తయిన తర్వాత స్టవ్, రెగ్యూలేటర్ రెండూ ఆఫ్ చేయాలి.
● గ్యాస్ వాసన వస్తే ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి గాలి బయటకు వెళ్లేలా చూడాలి.
● ఇంట్లో రెండు సిలిండర్‌లు ఉంటే పక్కపక్కన ఉంచకుండా దూరంగా పెట్టాలి.
● గ్యాస్ సిలిండర్‌లో మంటలు వస్తే వెంటనే తడి దుప్పటి సిలిండర్‌పై కప్పితే మంటలు అదుపులోకి వస్తాయి.
● సిలిండర్‌ను నేరుగా సూర్యకాంతి తగిలే ప్రదేశంలో లేదా వేడి ప్రదేశాల్లో ఉంచవద్దు.
● ఎప్పుడూ నిటారుగా ఉంచాలి.
ఏళ్ల తరబడి ఒకే పైపు, రెగ్యులేటర్ వాడరాదు.
గ్యాస్ లీకై వాసన వచ్చినప్పుడు ఇంట్లోని లైట్లు, లేదా ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆన్, ఆఫ్ చేయడం ప్రమాదకరం.
గ్యాస్ వాసన వచ్చిన వెంటనే ఇంట్లోని అన్ని తలుపులు, కిటికీలు తెరవాలి.
అవగాహన కల్పించాలి
మా కాలనీలో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందడం బాధాకరం. ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యత ఏజెన్సీలపై ఉంది. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ప్రతి కాలనీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – చంద్రశేఖర్, ఎల్‌ఐజీ కాలనీ
ఏమరుపాటు వద్ద్దు..
గ్యాస్ సిలిండర్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్యాస్ లీకై న సమయంలో జాగ్రత్తలు, వాటి నివారణకు ఏమి చేయాలి అనే విషయాలపై చైతన్యం తీసుకొస్తున్నా. ఏమరుపాటు వద్దు.. జాగ్రత్తలే మేలు. అవగాహనతో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పూర్తిస్థాయిలో ప్రమాదాలను నివారించవచ్చు.
– బి.నాగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి


