లాభాలు పట్టు
జిల్లాలో 150 ఎకరాల్లో
మల్బరీ తోటల పెంపకం
60 ఎకరాల సాగు లక్ష్యం
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతోంది. ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడంతో పట్టు పురుగుల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ తోటలు ఉండగా, మరో 60 ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 20
ఎకరాల్లో తోటలు పెంచడానికి రైతులు
దరఖాస్తు చేసుకున్నారు.
– జహీరాబాద్ టౌన్:
సిల్క్ సమగ్ర పథకం కింద రాయితీలు
ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ మల్బరీ సాగు, పట్టు పరిశ్రమ నిర్వహణ కోసం ప్రొత్సాహకాలు ప్రకటించింది. రెండేళ్లు క్రితం పట్టుగూళ్ల ధర కిలో రూ. 400 ఉండగా, గతేడాది రూ. 600కు పెరిగింది. మార్కెట్‌లో కూడా డిమాండ్ ఉండడంతో తోటల పెంపకం పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాలు సిల్క్ సమగ్ర పథకం ద్వారా రాయితీలు కూడా ఇస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ జనరల్ రైతులకు వేర్వేరుగా రాయితీలు ప్రకటించారు.
మల్బరీ మొక్కలను ఒకసారి నాటితే నిరంతర కాపు వస్తుంది. చీడపీడల బెడద అంతగా ఉండదు. ప్రారంభంలో షెడ్డు తదితరాలకు పెట్టుబడి అసరం ఉంటుంది. ఆ తర్వాత పంటలకు గుడ్లను కొనటం, మందు ద్రావణం, కూలీలు తదితర చిన్న చిన్న పెట్టుబడులు మాత్రమే ఉంటాయి. ఏడాదిలో 6 నుంచి 8 పంటల వరకు కాపు తీసుకొవచ్చు. 100 గుడ్లకు 80 కిలోల వరకు పట్టుగూళ్లు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కూకూన్ ధర రూ. 600 వరకు ఉంది. 25– 35 రోజులకో పంట పూర్తవు తుండగా, ఖర్చులు పొనూ ఎకరాకు కనీసం రూ. 80 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఆదాయం వస్తుంది. సిల్క్ సమగ్ర పథకం ద్వారా మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకానికి పలు రాయి తీలు ఇస్తుంది. జనరల్ రైతులకు రెండెకరాల మల్బ రీ సాగుకు రూ. 60 వేలు ఇస్తుండగా, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 78 వేలు ఇస్తుంది. పట్టు పురుగుల ను పెంచడానికి షెడ్డు నిర్మాణం కోసం రూ. 4.50 నుంచి రూ. 6.5 లక్షలు ఖర్చు అవుతుంది. షెడ్డు నిర్మాణానికి సాధారణ రైతులకు రూ. 2.25 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.95 లక్షలు కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందజేస్తుంది. షెడ్డులో అమర్చే స్టాండ్‌లు, ట్రేలు ఇతర సామగ్రికి రూ. 37,500 వేలు, రోగ నిరోధక మందులకు రూ. 2,500 నుంచి రూ. 3, 250 చొప్పున నిధులు ఇస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
