మండుతున్న కూరగాయలు
● కిలో గోరుచిక్కుడు రూ.100 ● బీన్స్ రూ.120 ● ఇంటి బడ్జెట్ తారుమారు
సదాశివపేట(సంగారెడ్డి): మోంథా తుపాను, కార్తీక మాసం ప్రభావం కూరగాయలపై పడింది. ఈ వర్షాలు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో అక్కడక్కడ కురుస్తోన్న వర్షాలకు కూరగాయలు, ఆకుకూరలు తడిచిపోయి పూర్తిగా పాడవుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఉద్యానపంటలు, కూరగాయలు సాగుచేస్తున్న రైతులు నష్టపోయారు. కూరగాయల ధరలు గతంతో పరిశీలిస్తే కిలోపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరుగుదల కనిపిస్తుంది. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, పటాన్‌చెరు, జోగిపేట, నారాయణఖేడ్, రామచంద్రాపూర్, ఇస్నాపూర్, జిన్నారం మార్కెట్‌లకు కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. రైతులు పండించిన కూరగాయలు మార్కెట్‌లో విక్రయించాల్సి వస్తోంది. స్థానికంగా పండించే కూరగాయలు కంటే ఎక్కువశాతం ఇతర ప్రాంతాల నుంచి రావాల్సి ఉండటంతో ధరలు భారీగా పెరిగాయి.
డిమాండ్ పెరిగింది..సరఫరా తగ్గింది
జిల్లాలో మార్కెట్లో గత నాలుగు రోజులుగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయలు హైదరాబాద్, వికారాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలంటే అదనపు భారం పడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలిలా ఉన్నాయి. వంకాయ రూ.80, బెండ రూ.80, పచ్చిమిర్చి రూ.80, బీర రూ.80, క్యారెట్ రూ.100, దోస రూ.50, కాకర రూ.80, చిక్కుడు రూ.100, బీన్స్ రూ.120, బంగాళదుంప రూ.90, క్యాప్సికం రూ.80, దోసకాయ రూ.80, ఆలుగడ్డ రూ.40, టమాట రూ.40, దొండకాయ రూ.60, క్యాలిఫ్లవర్ రూ.50. క్యాబేజీ రూ.40, బీట్‌రూట్ 80, కొత్తిమీర కట్ట రూ.10, ఆకుకూరలు మూడు కట్టలు రూ.20లకు అమ్ముతున్నారు.
ఆర్థిక భారం
ప్రతీ నెల మా కుటుంబానికి రూ. వెయ్యి వరకు ఖర్చయ్యే ది. ప్రస్తుతం అది రెట్టింపయ్యేలా ఉంది. ప్రస్తుతం మరో వెయ్యి అదనంగా ఖర్చుపెట్టాల్సి వస్తోంది.ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
–నల్ల విజయలక్ష్మి, గృహిణి సదాశివపేట


