వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బాల్‌రెడ్డి ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 24న సాయంత్రం బయటకు వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సమత ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లోనే ఉంది. స్థానికంగా చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు.
మరో ఘటనలో ఆటో డ్రైవర్..
పటాన్‌చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన మోహన్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24న ఉదయం ట్రాలీ ఆటో కిరాయి వచ్చిందని, ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు.
కుటుంబ కలహాలతో
యువకుడు ఆత్మహత్య
గజ్వేల్‌రూరల్: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలం రిమ్మనగూడలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎన్నెల్లి కిషన్(31) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలంగా కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిషన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గడ్డి మందు తాగి..
సిద్దిపేటకమాన్: వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేటలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన కడవెర్గు యాదగిరి(40) జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన అనితతో 16ఏళ్ల కింద వివాహమైంది. వీరికి పదమూడేళ్ల కూతురు ఉంది. నాలుగేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిగా ఉంటున్నారు. యాదగిరి స్థానికంగా తల్లితో పాటు ఉంటూ ఇర్కోడులో పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది. ఈ క్రమంలోనే యాదగిరి మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం ఇంట్లో గడ్డి మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం


