12 మందికి ఐదుగురే హాజరు?
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 12 మంది టీచర్లు ఉంటే బుధవారం ప్రార్థన సమయానికి ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. విద్యార్థులకు ఎస్‌ఏ పరీక్షలు 9.15 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉన్నా.. టీచర్లు రాకపోవడంతో కాలేదు. 9.30 నిమిషాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడు హాజరు రిజిస్టర్‌లో మూడు రోజుల సంతకాలు పెట్టి బయటకు వెళ్లిపోయాడు. నిత్యం ఇలాగే ఉపాధ్యాయులు, వంట చేసే సిబ్బంది సైతం విధులకు గైర్హాజరు అవుతున్నారని విద్యార్థుల తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విధులకు రాని ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడు హాజరు వేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిత్యం ఇదే తంతు


