తెగుళ్ల సమస్యలు
పాటిస్తే మేలైన దిగుబడులు
కూరగాయల సాగుపట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో ప్రధానంగా ఆలుగడ్డ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ పంటలు వేసుకుంటారు. జహీరాబాద్ ప్రాంతంలోనే అత్యధికంగా సాగవుతుంది. రైతులు విత్తనం నాటినప్పటి నుంచి పంటను తీసుకునే వరకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై డీడీఎస్–కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త జి.శైలజ రైతులకు పలు సూచనలు చేశారు. –జహీరాబాద్
వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగటి వేళ 32 డిగ్రీల సెంటిగ్రేడ్, రాత్రి 15–20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న నేలలు ఆలుగడ్డ సాగుకు అనుకూలం. ఆలు విత్తనాన్ని తెగుళ్లు, వ్యాధులు సోకని వాటిని ఎంపిక చేసుకోవాలి. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దుంపలను ఎంచుకోవాలి. ప్రతి దుంప సుమారుగా 30 నుంచి 40 గ్రాముల మేర బరువు ఉండాలి. కన్నులు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి 10 లీటర్ల నీటికి ధమోవనారిమాను 100 గ్రాములు, జిబ్బరెల్లిక్ ఆమ్లం 10 మిల్లి గ్రాములను కలిపి దుంపలను 10 నిమిషాల పాటు ఉంచి, తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి.
నేల తయారీ.. ఎరువులు..
మూడు నుంచి నాలుగు సార్లు లోతు దుక్కి దున్నుకోవాలి. బోదెలు, సాళ్ల పద్ధతిలో నాటుకుంటే మొలక శాతం ఎక్కువగా వస్తుంది. ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ పాస్పేట్, 40 కిలోల యూరియా, 30 కిలోల పొటాష్ చల్లుకోవాలి. దుంపలను నాటే ముందు శిలీంధ్ర నాశనితో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒక లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెట్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను కలిపి దుంపలను 20 నిమిషాల పాటు నానబెట్టి, తరువాత నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. కలుపు నివారణకు దుంపలను నాటిన తర్వాత మెట్టిబుజిన్‌ను పిచికారీ చేయాలి. ప్రతి 7 రోజులకు లేదా 10 రోజులకు క్రమం తప్పకుండా నీటిని డ్రిప్, లేదా స్ప్రింక్లర్ల ద్వారా అందించాలి.
రసం పీల్చే పురుగల బెడద ఉంటే డైమిథోయేట్ 3. మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒకటి లేదా రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. శనగపచ్చ పురుగును గమనిస్తే ఎకరానికి 4–10 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర్లి బ్లెట్ ఉంటే మాంకోజెట్ 2.5 గ్రా, లేదా 2 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేట్ బ్లెట్ ఆకుల కింద తెల్లటి వలయాకార మచ్చలు ఏర్పడితే.. 2 మి.లీ హెక్సాకోనజోల్ లేదా 2 గ్రాముల క్లోరోదాలోనిల్‌ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే తెగుళ్లు తగ్గి అధిక దిగుబడులను సాధించవచ్చు.
విత్తనం ఎంపిక ముఖ్యమే..
చీడ,పీడలకు మందులుపిచికారీ చేయాలి
డీడీఎస్–కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త జి.శైలజ
ఆలు సాగులో మెలకువలు


