చిరుత కలకలం
తూప్రాన్: మండల పరిధిలోని గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కనిపించిన చిరుత మరోమారు బుధవారం కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉదయం అటవీ ప్రాంతంలోని ఓ గుట్టపై చిరుతను పలువురు గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో బుధవారం పోలీసులు నార్కోటిక్ డాగ్ తనిఖీలు చేపట్టారు. బస్టాండ్‌తోపాటు జనసంచార ప్రదేశాలు, పలు వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేశారు. భద్రత చర్యల్లో భాగంగా గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్, గంజాయి, తదితర మత్తు పదార్థాలు రవాణా, విక్రయాలు నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనుమానంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జహీరాబాద్ టౌన్: మండలంలోని గిరిజన తండాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్‌ను ఆల్‌ఇండియా ట్రైబల్ ఫెడరేషన్(ఏఐటీఎఫ్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్‌పవార్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ తండాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మూత్రశాలలు, తాగునీరు, సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్ నవంబర్‌లో జహీరాబాద్‌కు వస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
మద్దూరు(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని గాగిళ్లాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేక రామాంజనేయులు మంగళవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద పాడిగేదెను కట్టేశారు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. బోరు మోటార్‌కు ఉన్న సర్వీసు వైరు పాడిగేదెకు చుట్టుకుని, విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిందని బాధిత రైతు తెలిపాడు. గేదె విలువ రూ.లక్ష వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
తప్పిన ప్రమాదం
నారాయణఖేడ్: ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. కంగ్టి వైపునుంచి ఖేడ్ వైపు మంగళవారం రాత్రి ఓవర్ లోడ్‌తో వస్తున్న లారీ మున్సిపాలిటీ పరిధిలోని నెహ్రూనగర్ హనుమాన్ ఆలయ సమీపంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు.
చిరుత కలకలం
చిరుత కలకలం
చిరుత కలకలం


