పిల్లుట్లలో చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గంగుల కిష్టారెడ్డి, అనసూయ ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి పైనుంచి లోనికి వచ్చి బీరువా పగులగొట్టారు. ఏమీ దొరకకపోవడంతో మరోగదిలో డబ్బాలో ఉన్న 4 తులాల బంగారం, రూ.65 వేలు అపహరించారు. నిద్రిస్తున్న అనసూయ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు తీయడానికి ప్రయత్నించగా ఆమె మేలుకుని అరవడంతో దొంగలు పారిపోయారు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీంతో పరిశీలించి ఆధారాలు సేకరించారు. గ్రామానికి చెందిన ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.


