మురుగునీటి పాలైన ధాన్యం
జోగిపేటలో భారీ వర్షం
● కన్నీరు పెట్టుకున్న రైతులు
జోగిపేట(అందోల్): అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 200 సంచుల వరి ధాన్యం వర్షపునీటిలో తడిసి, మురికి కాలువల్లోకి కొట్టుకుపోయింది. జోగిపేట మార్కెట్ గంజ్‌లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో అన్నాసాగర్, జోగిపేట ప్రాంత రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ధాన్యం తడిసిముద్దయ్యింది. గంజ్‌లో సోమవారం కొనుగోళ్లు ప్రారంభించగా రైతులు తాము పండించిన ధాన్యాన్ని వారం రోజుల క్రితం నుంచే ఆరబెట్టుకుంటున్నారు. వర్షాలు లేవన్న అంచనాతో రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లారేసరికి భారీ వర్షం కారణంగా ధాన్యం అంతా కొట్టుకుపోయింది. జోగిపేటకు చెందిన రైతులు లింగం, అరీల్ గౌడ్, అన్నాసాగర్ గ్రామానికి చెందిన పోచయ్యలకు చెందిన వరి ధాన్యం వర్షం కారణంగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులను నిర్వాహకులను కోరారు.
మళ్లీ వర్షం రావచ్చు...
మళ్లీ వర్షం కురిసే సూచనలుండటంతో రైతులు తమ ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని మార్కెట్ కమిటీ సిబ్బంది రైతులకు తెలియజేశారు. వాతారణం చల్లగా ఉన్నందున రైతులు జాగ్రత్త వహించాలని చెప్పారు.
మురుగునీటి పాలైన ధాన్యం


