ఐసీయూ అందుబాటులోకి తేవాలి
ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర
సంగారెడ్డి: ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగం భవనం వెంటనే రోగులకు అందుబాటులోకి తెచ్చి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర కోరారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. ఫోరమ్ బృందం సభ్యులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర విభాగం రేకుల షెడ్డులో నడుస్తోందని, బెడ్‌లు విరిగి పాడై పోయాయన్నారు. ఆస్పత్రిలో మరుగు దొడ్లు కూడా దుర్వాసనతో అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పారు. రోగులకు మెనూ ప్రకారం ఆహారం, భోజనం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచి నీటిసౌకర్యం కూడా ఆస్పత్రిలో లేదని రోగులు తాగునీటిని డబ్బులు చెల్లించి కొనుక్కుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోనే ఆస్పత్రికి వసతులు లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


