ధాన్యం సేకరణ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ ఏదీ?

Oct 29 2025 9:35 AM | Updated on Oct 29 2025 9:35 AM

ధాన్యం సేకరణ ఏదీ?

ధాన్యం సేకరణ ఏదీ?

తేమ శాతం తగ్గాక కొనుగోళ్లు..! 2.23 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ 207 కొనుగోలు కేంద్రాలు..

పలు మండలాల్లో వారం క్రితమే ప్రారంభమైన వరి కోతలు కొన్ని చోట్ల కేంద్రాలు తెరిచినా.. ప్రారంభంకాని తూకాలు అకాల వర్షాలకు తడిసి పోతున్న ధాన్యం ఇతర జిల్లాలో ఊపందుకున్న కొనుగోళ్లు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ తూకాలు మాత్రం షురూ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కొన్ని మండలాల్లో వారం క్రితమే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతున్నారు. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి తూకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా..? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హత్నూర, కల్హేర్‌ తదితర మండలాలతోపాటు, నారాయణఖేడ్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో వరి కోతలు జోరందుకున్నాయి. కాస్త ముందుగా వరి నాట్లు వేసుకున్న చోట్ల ధాన్యం చేతికందింది. చేతికందిన వెంటనే ధాన్యం తూకాలు అయితే ఇబ్బందులు ఉండేవి కావు. కానీ, కొనుగోలు కేంద్రాల్లో మాత్రం తూకాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. పక్కనే ఉన్న మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకుంది. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇంకా తూకాలు ప్రారంభం కాలేదు.

ధాన్యంలో తేమ శాతం తగ్గాకే తూకాలు ప్రారంభిస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. లేనిపక్షంలో రైసుమిల్లర్లు ధాన్యం దించుకోవడానికి నిరాకరిస్తారని అంటున్నారు. కానీ చాలాచోట్ల 17 కంటే తక్కువ తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కూడా తూకాలు వేయడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే హత్నూరతోపాటు నారాయణఖేడ్‌ డివిజన్‌లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. కాగా జోగిపేట ప్రాంతంతోపాటు, గుమ్మడిదల, జిన్నారం తదితర మండలాల్లో ఈసారి కాస్త ఆలస్యంగా వరి నాట్లు వేశారు. ఈ మండలాల్లో కూడా మరో నాలుగైదు రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా తూకాలు ఊపందుకుంటే ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 51,492 హెక్టార్లు కాగా, ఈసారి 55,826 హెక్టార్లలో ఈ పంట సాగైంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం హెక్టారుకు 6.17 టన్నుల ధాన్యం వస్తుందని లెక్కగట్టారు. ఈ మేరకు సుమారు 3.29 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి ఉంటుందని అంచనా. ఇందులో స్థానిక అవసరాలు పోగా సుమారు 2.23 లక్షల మెట్రిక్‌ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రణాళికను రూపొందించారు. ఇందులో సుమారు 20 వేల మెట్రిక్‌ టన్నులు సన్న రకాలు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు.

ఈసారి జిల్లా వ్యాప్తంగా 207 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో ఐకేపీ కేంద్రాలు 89 కాగా, సహకార సంఘాల ఆధ్వర్యంలో 88 కేంద్రాలు, డీసీఎంఎస్‌లు కేంద్రాలు 29 ఎఫ్‌పీఓకు ఒక కేంద్రాన్ని కేటాయించారు. 207 కేంద్రాల్లో 20 కేంద్రాలను కేవలం సన్న రకం ధాన్యం సేకరణ కోసమే ఏర్పాటు చేశారు.

ఆందోళనకు గురిచేస్తున్న తుపానులు

అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. కండ్ల ముందే చేతికందిన పంట వర్షపునీటిలో కొట్టుకుని పోతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభించి ఉంటే తమకు ఈ కష్టాలు తప్పేవని రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement