యాంత్రీకరణ బాట
యంత్రాలతో రైతులకు ప్రయోజనం
చెరుకు కోతలకు తీరనున్న కూలీల కొరత
● నేడు ఐదు యంత్రాలు అందజేయనున్న బ్యాంకర్లు ● సంగారెడ్డి జిల్లాకు 35 కోత యంత్రాలు
జహీరాబాద్: చెరుకు పంట నరికేందుకు గాను రైతులను తీవ్రంగా వేధిస్తూ వస్తున్న కూలీల కొరతను ఇక నుంచి యంత్రాలు తీర్చనున్నాయి. చెరుకు నరికేందుకు కూలీలు స్థానికంగా లభించని పరిస్థితి ఉండటంతో గత ఐదేళ్ల నుంచి పక్క రాష్ట్రాల్లోని కూలీలపై ఆధారపడుతూ వస్తున్నారు. ఇక నుంచి ఆ సమస్య నుంచి కూడా రైతులు గట్టెక్కనున్నారు. మరో వారం పది రోజుల్లో క్రషింగ్ సీజన్ ప్రారంభం కానుంది. 2025–26 క్రషింగ్ సీజన్‌కు గాను సంగారెడ్డి జిల్లాలో సుమారు 35 చెరుకు కోత యంత్రాలు రంగంలోకి దిగనున్నాయి. జిల్లాలోని సంగారెడ్డిలో గల గణపతి చక్కెర కర్మాగారం, రాయికోడ్ మండలంలోని మాటూర్‌లో గల గోదావరి–గంగా కర్మాగారాల పరిధిలో సుమార 12 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి కానుంది. ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 9లక్షల టన్నుల చెరుకు పంట ఉత్పత్తి కానుందని అంచనా. ఈ క్రషింగ్ సీజన్‌కు గాను జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న చెరుకును నరికేందుకు వీలుగా గోదావరి–గంగా కర్మాగారానికి చెరుకును తరలించుకునేందుకుగాను 18 చెరుకు కోత యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. కామారెడ్డి, మాగి కర్మాగారాలకు తరలించేందుకుగాను 10 కోత యంత్రాలు, గణపతి కర్మాగారానికి తరలించేందుకు 3 యంత్రాలు, మహబూబ్‌నగర్‌లోని కొత్తకోట కర్మాగారానికి తరలించుకునేందుకు 4 యంత్రాల వంతున చెరుకు కోతకు ఉపయోగించనున్నారు. ఒక్కో యంత్రం రోజుకు 70 నుంచి100 టన్నుల వరకు చెరుకు పంటను కోసే సామర్థ్యం ఉంది. యంత్రాలు కోసే చెరుకు పంటను వెంట వెంటనే ఆయా కర్మాగారాలకు ట్రక్కుల్లో తరలించనున్నారు. యంత్రాలు చెరుకును కోయడంతో ఒకే రోజులోనే రైతులకు సంబంధించిన కమతాలు ఖాళీ అవుతాయి. దీంతో రెండో పంటకు సిద్ధం చేసుకునేందుకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కూలీలతో చెరకు నరికించడం వల్ల మూడు ఎకరాల కమతానికి వారం నుంచి పది రోజులు పట్టేది. యంత్రాలను వాడటం వల్ల మూడుఎకరాల్లో ఉండే చెరుకు పంట దిగుబడులను పరిగణలోకి తీసుకుంటే ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయవచ్చు. భూమి సారాన్ని బట్టి ఎకరాకు 25 నుంచి 60 టన్నుల వరకు చెరుకు పంట దిగుబడి వస్తుంది. సగటున ఎకరానికి 33 టన్నుల దిగుబడులు వస్తాయి.
బ్యాంకర్లు ముందుకు
చెరుకు కోత యంత్రాలను ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వస్తున్నారు. దీంతో రైతులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది మంజీర గ్రామీణ బ్యాంకులు నాలుగు యంత్రాలను రైతులకు అందజేశాయి. ఈ ఏడాది కూడా ఐదు యంత్రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. జహీరాబాద్‌లో బుధవారం నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ మేరకు యంత్రాలు స్థానిక రైతులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది.
చెరుకు కోతకు యంత్రాలను ఉపయోగించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కూలీలు దొరకకపోతే ఇబ్బందులు పడేవారు. కొరతను బట్టి డిమాండ్ మేరకు కూలీ రేట్లు చెల్లించుకోవాల్సి వచ్చేది. యంత్రాల వల్ల ఒకే రోజులో చిన్న కమతాలు ఖాళీ అవుతాయి. సంగారెడ్డి జిల్లాలో 30కి పైగా యంత్రాలు చెరుకు కోతకు సిద్ధం అవుతున్నాయి. యంత్రాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు వస్తుండటంతో రైతులు కొనుగోలుకు ముందుకు వస్తున్నారు.
–రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్, సంగారెడ్డి
యాంత్రీకరణ బాట


