ఖనిజ సంపద లూటీ..! | - | Sakshi
Sakshi News home page

ఖనిజ సంపద లూటీ..!

Oct 14 2025 8:51 AM | Updated on Oct 14 2025 8:51 AM

ఖనిజ సంపద లూటీ..!

ఖనిజ సంపద లూటీ..!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భూగర్భ గనులశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్‌ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, గనులశాఖకు రూ.లక్షల్లో రాయల్టీ, సీనరేజీ ఎగవేస్తూ నిత్యం కొనసాగుతున్న ఖనిజ సంపదను అక్రమ రవాణా గుట్టును రాష్ట్ర విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రట్టు చేసింది. ఆ విభాగం రాష్ట్ర ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం జిల్లాలో ఆకస్మిక తనిఖీల్లో ఏకంగా 16 అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడ్డాయి. ఎలాంటి ట్రానిట్స్‌ పర్మిట్‌ లేకుండా ఖనిజ సంపదను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వాహనాలను జిల్లా భూగర్భ గనులశాఖ ఽఅధికారులకు అప్పగించగా పెద్ద మొత్తంలో జరిమానాలు విధించారు.

విచ్చలవిడి అక్రమ దందా

జిల్లాలో అపారమైన ఖనిజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారనేదానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. భూగర్భగనుల శాఖకు చెల్లించాల్సిన రాయల్టీ, సీనరేజీలను ఎగవేస్తూ, అర్థరాత్రి వేళల్లో అడ్డూఅదుపు లేకుండా ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు మరోసారి రుజువైంది. గతంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో రూ.వందల కోట్ల రాయల్టీ ఎగవేసిన ప్రజాప్రతినిధులు, నేతలే ఈ ప్రభుత్వం హయాంలోనూ ఈ దందాను కొనసాగిస్తున్నారనేది రుజువైంది. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఒక్క రాత్రి తనిఖీ చేస్తే ఏకంగా 16 వాహనాలను పట్టుకున్నారంటే నిత్యం ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఖనిజ సంపదను లూటీ చేయడానికి మరిగిన ప్రజాప్రతినిధులు, నాయకుల అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చేష్టలుడిగి చూస్తున్న జిల్లా అధికారులు

జిల్లాలో విచ్చలవిడిగా మైనింగ్‌ అక్రమ రవాణా జరుగుతుంటే భూగర్భ గనులశాఖ జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. నిత్యం తనిఖీలు చేస్తూ అక్రమ మైనింగ్‌ వాహనాలపై ఉక్కుపాదం మోపాల్సిన ఆశాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రాష్ట్ర విభాగం తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వాహనాలు పట్టుబడుతుంటే, జిల్లా అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఎందుకు పట్టుబడటం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆశాఖ జిల్లా అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నారు. ఈ తనిఖీల కోసం భూగర్భ గనులశాఖ ప్రత్యేకంగా తనిఖీల బృందాలను నియమించింది. ఈ బృందాలు కూడా ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో విలువైన ఖనిజ సంపద లూటీ అవుతున్నట్లు తేలుతోంది.

నిశిరాత్రి వేళల్లో .. మైనింగ్‌ మాయ

అక్రమ రవాణా చేస్తున్న 16 వాహనాలను

పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌

యథేచ్ఛగా రాయల్టీ,

సీనరేజీ ఎగవేస్తున్నట్లు గుర్తింపు

గనుల శాఖ మంత్రి ఇన్‌చార్జిగా ఉన్న

జిల్లాలో వెలుగులోకి మైనింగ్‌ దందా

పిలిస్తే వెళ్లి జరిమానా విధించాం

రెండు రోజుల క్రితం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పిలిస్తే వెళ్లాం. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని మాకు అప్పగించారు. వాటికి జరిమానాలు విధించాం. ఎన్ని వాహనాలను పట్టుకున్నాం.. ఎంత జరిమానా వివరాలు కార్యాలయంలో ఉన్నాయి.

– రవిబాబు,

భూగర్భ గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement