
ఎన్నికల అధికారులంఅంటూ తనిఖీ
దంపతుల నుంచి 6 తులాల నగలు తస్కరణ
పాపన్నపేట(మెదక్): ఎన్నికల అధికారుల మంటూ నమ్మబలికి దంపతుల వద్ద నుంచి 6 తులాల బంగారం తస్కరించారు. ఈ సంఘటన పాపన్నపేట మండలం కొత్తపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివా స్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లికి చెందిన ఏడుపాయ ల మాజీ డైరెక్టర్ బూచనెల్లి కిషన్, మాణెమ్మ దంపతులు ఎల్లుపేటలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యక్రమానికి స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో కొత్తపల్లి అనంతుని వాగు వంతెన వద్దకు రాగానే.. ఇద్దరు అగంతుకులు తాము ఎన్నికల అధికారులమంటూ వీరి వాహనాన్ని ఆపారు. తమ వద్ద నగదు లేదని వారు చెప్పగా, మాణెమ్మ మెడలో ఉన్న బంగారాన్ని చూపిస్తూ.. జాగ్రత్తమ్మా దానిని స్కూటీ డిక్కీలో వేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె పుస్తెల తాడు, గుండ్లు తీసి దస్తీలో కట్టి, డిక్కీలో వేసింది. వెంటనే అగంతకులు మరోసారి చెక్ చేద్దామంటూ.. డిక్కీలో చేయి పెట్టి, మాటలతో ఏమార్చి నగలు తస్కరించారు. అగంతకులు వెళ్లి పోగానే అనుమానం వచ్చిన దంపతులు, డిక్కీలో బంగారు ఆభరణాల కోసం వెతకగా..అవి కనిపించ లేవు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.