వరుస బదిలీలు అందుకేనా? | - | Sakshi
Sakshi News home page

వరుస బదిలీలు అందుకేనా?

Oct 16 2025 8:16 AM | Updated on Oct 16 2025 8:16 AM

వరుస

వరుస బదిలీలు అందుకేనా?

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కీలక అధికారులపై వరుసగా వేటు పడుతుండటం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా రెవెన్యూశాఖలో అధికారులకు ఆకస్మికంగా స్థాన చలనాలు కలుగుతుండటం కలకలం రేపుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డిపై ఇటీవల ఆకస్మిక బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. తాజాగా రామచంద్రాపురం తహసీల్దార్‌ సంగ్రాంరెడ్డిపై కూడా బదిలీ వేటు పడింది. ఆయన్ను ఏకంగా జిల్లాలోనే అత్యంత మారుమూల మండలమైన నాగల్‌గిద్దకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిపాలన సౌలభ్యం పేరుతో ఈ బదిలీ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. కానీ ఈ బదిలీ రెవెన్యూ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంగ్రాంరెడ్డిపై ఆకస్మిక బదిలీ వేటుకు కారణాలేంటనే దానిపై చర్చ జరుగుతోంది. రాజకీయ ఒత్తిడే కారణమా? లేదంటే ఏదైనా అవినీతి ఆరోపణలా? అనే అంశంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డికి

అసెంబ్లీ ఎన్నికల బదిలీల్లో భాగంగా సంగ్రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి రామచంద్రాపురం తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఈ రామచంద్రాపురం తహసీల్దార్‌ పోస్టుకు ఎంతో డిమాండ్‌ ఉంటుంది. పూర్తిగా నగరంలో కలిసి పోయిన ఈ మండలంలో పట్టణీకరణ ఉన్న ప్రాంతం. భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, రూ.వందల కోట్లు విలువ చేసే భూములు ఉండే ఇలాంటి మండలాల్లో కీలకమైన తహసీల్దార్‌ పోస్టు కోసం అధికారులు చేయని ప్రయత్నాలు ఉండవు. పెద్ద ఎత్తున రాజకీయ పైరవీలు చేసుకుని, ప్రజాప్రతినిధుల అండదండలతో ఇలాంటి మండలాల్లో పోస్టింగ్‌లు తెచ్చుకుంటారు. అయితే ఇలాంటి మండలం కీలక మండలం నుంచి ఆకస్మికంగా ఏకంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలం నాగల్‌గిద్దకు బదిలీపై పంపడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. బదిలీ అయిన సంగ్రాంరెడ్డి బుధవారం వరకు విధుల్లో చేరలేదని సమాచారం.

గత నెలలో ఆర్డీఓపై వేటు..

సంగారెడ్డి ఆర్డీఓగా పనిచేసిన రవీంద్‌రెడ్డిపై గత నెల సెప్టెంబర్‌లో ఆకస్మిక వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. రవీందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ హాయాంలో జిల్లాలో చాలా కాలంగా పనిచేశారు. కాంగ్రెస్‌ సర్కారు వచ్చిన వెంటనే రవీందర్‌రెడ్డిని నిమ్జ్‌ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు బదిలీ జరిగింది. ఇది లూప్‌లైన్‌ పోస్టుగా రెవెన్యూ వర్గాల్లో అభివర్ణిస్తుంటారు. లూప్‌లైన్‌ పోస్టులోకి వెళ్లిన వెంటనే రవీందర్‌రెడ్డి అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల అండదండలతో కొన్ని నెలల్లోనే తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగా పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఈ ఆర్డీఓ కార్యాలయం పనితీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యాలయం పైరవీకారులకు నిలయంగా మారిందనేది బహిరంగ రహస్యంగా మారింది. సామాన్య రైతులు, నిరుపేదలు వివిధ పనుల నిమిత్తం ఈ కార్యలయానికి వస్తే కనీసం పట్టించుకోని అధికారులు..బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, దళారుల పనులను మాత్రం చకచకా చేసిపెట్టడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో రవీంద్‌రెడ్డిపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఇది దాదాపు నెల రోజులు గడుస్తుండగానే ఇప్పుడు రామచంద్రాపురం తహసీల్దార్‌ను అత్యంత మారుమూల మండలానికి పంపడం రెవెన్యూశాఖతో పాటు, సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొన్న సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డిపై..

ఇప్పుడు ఆర్సీపురం

తహసీల్దార్‌కు స్థాన చలనం

అత్యంత డిమాండ్‌ ఉన్న మండలం

నుంచి మారుమూల మండలానికి..

రెవెన్యూశాఖలో చర్చనీయాంశమవుతున్న అధికారులపై చర్యలు

వరుస బదిలీలు అందుకేనా?1
1/1

వరుస బదిలీలు అందుకేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement