
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
● మహిళ కడుపులో 4.1 కిలోల గడ్డ తొలగింపు ● దుబ్బాక ఆస్పత్రి వైద్యుల ఘనత
దుబ్బాక: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు. బుధవారం సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్ ఆధ్వర్యంలో వైద్యులు ఓ మహిళకు కడుపులో నుంచి 4.1 కిలోల ఓవరియాన్ మాస్‌గడ్డను తొలగించారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందెడ్‌కు చెందిన జయ(30) ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. నాందెడ్‌లో ఎన్నో ఆస్పత్రులు తిరిగినా తగ్గడం లేదు. బంధువుల సమాచారం మేరకు మూడు రోజుల క్రితం దుబ్బాక ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అయితే కడుపులో 15 సెంటీమీటర్ల ఓవరియాన్ మాస్ గడ్డ ఉందని గుర్తించారు. ఈ క్రమంలో బుధవారం ఆయుష్మాన్‌భారత్ పథకం కింద ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోంచి గడ్డను తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని హేమరాజ్‌సింగ్ తెలిపారు. కాగా, ఆపరేషన్ చేసి జయ ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఆమె బంధువులు అభినందనలు తెలిపారు.