
ఎస్‌జీఎఫ్ క్రీడా సంబురం
● నేటి నుంచి పటాన్‌చెరులో ప్రారంభం ● మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు ● తరలిరానున్న 33 జిల్లాల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు
పటాన్‌చెరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలకు పటాన్‌చెరు మైత్రి మైదానం వేదికగా నిలవబోతోంది. గురువారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులతో క్రీడా పోటీల తోపాటు, క్రీడాకారులకు ఉచిత వసతి, భోజనం, ట్రోఫీలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు, 60 మంది శిక్షకులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా సంబరాల్లో పాల్గొనబోతు న్నారు. వాలీబాల్, కబడ్డీ పోటీలు జరగనున్నా యని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో మొదటిసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్‌చెరును వేదికగా నిలపడం జరిగింది. త్వరలో మహిళల కబడ్డీ జాతీయ పోటీలకు పటాన్‌చెరు వేదికగా నిలవబోతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి క్రీడాకారుడిని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.