
కష్టే ఫలి!
● హర్యానా, గుజరాత్ నుంచి 34 గేదెలు ● రోజూ 160 లీటర్ల పాల విక్రయం ● 57 ఏళ్ల వృద్ధుడి సక్సెస్‌పై కథనం
సొంతూరులో డెయిరీ ఫామ్
కష్టపడితే ఏదైనా సాధ్యం
కృషి పట్టుదలతో పాటు కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. నలబై ఏళ్ల పాటు బయలు నాటకం నేర్పించా. గత సంవత్సరం మా ఊరులో 34 గేదెలతో డెయిరీ ఫామ్ పెట్టిన. రెండు ఫూటల 160 లీటర్ల పాలు విక్రయిస్తున్నా. పాలల్లో కల్తీ జరిగే ఈ రోజుల్లో.. నాణ్యమైన పాలను విక్రయిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
– కాపు విఠల్, డెయిరీ ఫామ్ నిర్వాహకుడు
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసే ఈ రోజుల్లో ఓ వృద్ధుడు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నలబై ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడి.. నేడు ఓ డెయిరీ ఫామ్‌కు ఓనర్ అయ్యాడు. నాణ్యమైన పాలను అందించడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్న అఖిల డెయిరీ ఫామ్ నిర్వాహకుడు కాపు విఠల్ సక్సెస్‌పై కథనం.
– రేగోడ్(మెదక్)
మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన 57 ఏళ్ల రైతు కాపు విఠల్‌కు తొమ్మిది ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశాడు. 1985లో బయలు నాటకాలు నేర్పించే విద్యను నేర్చుకుని 40 ఏళ్ల పాటు 47 గ్రామాలు, పట్టణాల్లో సుమారు వెయ్యి మంది కళాకారులతో బయలు నాటకం ప్రదర్శించారు. అల్లుడి సూచన మేరకు గత సంవత్సరం గ్రామంలో అఖిల డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. హర్యానా, గుజరాత్ నుంచి ఒక్కో గేదెకు సుమారు రూ. లక్ష 80 వేలు వెచ్చించి మొత్తం 34 గేదెలను తీసుకొచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సుమారు 160 లీటర్ల పాలను రేగోడ్, నారాయణఖేడ్‌లో విక్రయిస్తూ లాభాలను పొందుతూ నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నలుగురు బిహార్ కూలీలతో పాటు తాను పని చేస్తూ పామ్‌ను విజయవంతంగా నడుపుతున్నాడు. ఫామ్‌కు సు మారుగా రూ.కోటి ఖర్చు అయిందని విఠల్ తెలిపా రు. రోజూ పాల విక్రయంతో సుమారు రూ.8,800, నెలకు రూ. 2 లక్షల 64 వేలు సంపాదిస్తున్నాడు. నేటి సమాజానికి ఈ వృద్ధుడు ఆదర్శంగా నిలుస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కష్టే ఫలి!

కష్టే ఫలి!